● ఊటీని తలపించే సుందర దృశ్యాలు ● ప్రకృతి ఒడిలో సేదదీరేలా ఏర్పాట్లు.. విడిదికి కాటేజీలు, సఫారీ వాహనాలు
ఎన్నో ప్రత్యేకతలు
అరుదైన పక్షులు, జింకలు, అడవిపందులు, కుందేళ్లు, కొండగొర్రెలు, ఎలుగుబంట్లు, నెమళ్లు రిజర్వాయర్ పరిసరాల్లో కనిపిస్తుంటాయి. అప్పుడప్పుడు చిరుతపులులు కూడా వస్తుంటాయి. పులిగుండాల నుంచి చంద్రుగొండ మండలంలోని పురాతనమైన పల్లేరుబాయి గుట్టపై కొలువైన శివాలయం(వీరభద్ర స్వామి) వరకు దట్టమైన అటవీ ప్రాంతంలో 20 కి.మీ. ప్రయాణిస్తే మరింత సుందర దృశ్యాలు కనువిందు చేస్తాయి. మధ్య మధ్యలో సెలయేర్లు, నీరు తాగేందుకు వచ్చే అటవీ జంతువులను చూడొచ్చు. ఈ మార్గంలో గుట్టలు ఎక్కుతూ, వాగులు దాటుతూ అటవీ అందాలను ఆస్వాదిస్తుంటే ఊటీ, కోడైకెనాల్ వంటి పర్యాటక ప్రాంతాలు గుర్తుకొస్తాయి.
సఫారీ వాహనాలు
పులిగుండాల వద్ద అటవీ, టూరిజం శాఖ ఆధ్వర్యాన ప్రత్యేకంగా ఎలక్ట్రిక్ సఫారీ వాహనాలను ఏర్పాటు చేశారు. ఇక్కడి నుంచి చంద్రుగొండ మండలం బెండాలపాడు సమీపాన ఎత్తయిన పర్వత శ్రేణిపై కొలువైన వీరభద్రస్వామి ఆలయం వరకు ఇందులో ప్రయాణం చేయొచ్చు. స్వచ్ఛమైన వాతావరణం మధ్య సాగే ప్రయాణం అనేక జ్ఞాపకాలను మిగులుస్తుంది. ఆలయం వద్ద బావిలో స్నానం చేసి స్వామిని దర్శించుకుంటే అంతా మంచి జరుగుతుందని భక్తులు నమ్ముతారు.
స్టార్ హోటళ్లకు దీటుగా వసతి
దట్టమైన అడవిలో ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఆస్వాదించేలా సందర్శకుల కోసం నాలుగు విడిది గృహాలను నిర్మించారు. స్టార్ హోటల్లో ఉండే సదుపాయాలన్నీ కల్పించారు. రాత్రిళ్లు ఇక్కడ బస చేసే పర్యాటకులకు అన్ని సౌకర్యాలు ఉంటాయి. అటవీ సిబ్బంది పహారా కాస్తూ రక్షణ కల్పిస్తుంటారు. విడిది గృహాల బుకింగ్ ఇంకా ఆన్‌లైన్ చేయకపోవడంతో స్థానిక సిబ్బందిని సంప్రదించాల్సి ఉంటుంది. ఇక ఇక్కడి చెక్క వంతెన, వాచ్ టవర్ల పైనుంచి అటవీ అందాలను చూసే అవకాశముంది. ఇప్పటికే పర్వదినాలు, సెలవు రోజుల్లో సందర్శకుల రద్దీ ఉంటోంది.
ధరలు తగ్గించి..
బస్సులు నడిపిస్తే...
పులిగుండాల వద్ద రోజంతా గడిపే వారితో పాటు కొందరు రాత్రి బస చేసేందుకు ఆసక్తి కనరుబస్తున్నారు. పులిగుండాలలో ప్రవేశానికి పెద్దలకు రూ.20, పిల్లలకు రూ.10, ఫొటో షూట్‌కు రూ.2వేలు, పార్కింగ్ రూ.20 నుంచి రూ.వంద చార్జీ నిర్ణయించారు. సఫారీ ప్రయాణానికి వ్యక్తులు, సమూహాలకు రూ.50 నుంచి రూ.వెయ్యి, బోటింగ్‌కు రూ.వంద చెల్లించాల్సి ఉంటుంది. ఇదంతా బాగానే ఉన్నా కాటేజీలను ప్రైవేట్ పరం చేయడంతో 24 గంటల బసకు టీ, టిఫిన్, భోజనంతో కలిపి రూ.3,500 నుంచి రూ.4,500 వరకు వసూలు చేస్తుండడం సందర్శకులకు భారంగా మారుతోంది. ఇక రవాణా సౌకర్యం సక్రమంగా లేకపోవడం సందర్శకులను నిరాశకు గురి చేస్తోంది. ఖమ్మం నుంచి సత్తుపల్లి బస్సు ఎక్కి పెనుబల్లి మండలం టేకులపల్లి వద్ద దిగాలి. అక్కడ నుంచి బ్రహ్మళకుంట వరకు ఆటోలో ప్రయాణించాల్సిందే. సొంత వాహనాలు ఉంటే తప్ప నేరుగా వెళ్లలేని పరిస్థితి ఉంది. ఆర్‌టీసీ అధికారులు సత్తుపల్లి నుంచి వయా పులిగుండాల మీదుగా ఖమ్మం వరకు సెలవు రోజుల్లోనైనా బస్సులు ఏర్పాటు చేస్తే సందర్శకులకు సౌకర్యంగా ఉంటుంది.


