వచ్చేనెల 9న ఖమ్మంలో
సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన
పింఛన్లు, స్మార్ట్ రేషన్ కార్డుల
పంపిణీలో మంత్రి తుమ్మల
రఘునాథపాలెం/ఖమ్మం అర్బన్: పేదలు ఆత్మగౌరవంతో జీవించేలా ఆర్థిక భరోసా కల్పించేందుకు చేయూత పింఛన్లు అందిస్తున్నామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా 4.5 లక్షల మందికి కొత్తగా పింఛన్లు మంజూరు చేసినట్లు తెలిపారు. రఘునాథపాలెం మండలం మంచుకొండ, ఖమ్మంలోని భక్త రామదాసు కళాక్షేత్రంలో శనివారం ఏర్పాటుచేసిన సమావేశాల్లో కొత్త లబ్ధిదారులకు కలెక్టర్ దివాకర టీ.ఎస్., కేఎంసీ కమిషనర్ అభిషేక్ అగస్త్యతో కలిసి ఆయన మంజూరు పత్రాలు అందజేశారు. అలాగే, రేషన్ లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అందజేశాక మంత్రి మాట్లాడుతూ సీఎం రేవంత్‌రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం ఆర్థిక ఇబ్బందులు ఉన్నా అర్హులందరికీ పింఛన్లు మంజూరు చేస్తున్నారని తెలిపారు. రఘునాథపాలెం మండలంలో 844 మందికి, జిల్లాలో 33 వేల మందికి కొత్తగా పింఛన్లు మంజూరయ్యాయని చెప్పారు. అర్హులైనా పింఛన్ మంజూరు కాని వారు ఆందోళన చెందొద్దని, దరఖాస్తులను పరిశీలించి తదుపరి విడతలో న్యాయం చేస్తామని తెలిపారు. త్వరలో నియోజకవర్గానికి మరో 2వేల ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యే అవకాశం ఉందని మంత్రి వెల్లడించారు. కాగా, మంచుకొండ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా మండలంలోని చెరువులను నింపి భూగర్భ జలాలను పెంచుతామని, బుగ్గవాగు పథకం ద్వారా పైప్‌లైన్ నిర్మించి వేసవిలోనూ చెరువుల్లో నీరు ఉండేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఎల్‌నినో ప్రభావంతో కరువు, అకాల వర్షాలు, తుపాన్ల ముప్పు పొంచి ఉన్న నేపథ్యాన రైతులు పంటల సాగులో మార్పులు చేసుకోవాలని సూచించారు. ఇటీవల తుపాన్లకు వరి దెబ్బతిన్నా ఆయిల్‌పామ్ తోటలకు పెద్దగా నష్టం జరగలేదని చెప్పారు.
సీఎంను ఆహ్వానిస్తాం..
ఖమ్మంలో మున్నేరు కేబుల్ బ్రిడ్జి, నూతన మార్కెట్, వెలుగుమట్ల మోడల్ కాలనీ, ప్రభుత్వ మెడికల్ కళాశాల భవనాలను ప్రారంభించేందుకు వచ్చేనెల 9న ఖమ్మం రావాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆహ్వానిస్తామని తుమ్మల తెలిపారు. ఈమేరకు పెండింగ్ పనులను త్వరగా పూర్తయ్యేలా అధికారులను పర్యవేక్షించాలని ఆదేశించారు. అనంతరం వెలుగుమట్లలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని మంత్రి తుమ్మల పరిశీలించారు. డిసెంబర్ 9న సీఎం పర్యటన ఖరారు కానున్నందున పనుల్లో వేగం పెంచాలని అధికారులకు సూచించారు. కలెక్టర్ దివాకర మాట్లాడుతూ అర్హత ఉండి పింఛన్ మంజూరు కాని వారు ప్రత్యేక కౌంటర్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. వృద్ధాప్య పింఛన్ పొందుతున్న వ్యక్తి మరణిస్తే, వారి జీవిత భాగస్వామి కార్యాలయాల చుట్టూ తిరిగే అవసరం లేకుండా పింఛన్ బదిలీ విధానాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమాల్లో డీఆర్‌డీఓ కె.శ్రీరామ్, జిల్లా పౌరసరఫరాలు, పశు సంవర్ధక శాఖ, వ్యవసాయ శాఖల అధికారులు చందన్ కుమార్, డాక్టర్ పురందర్, డి.పుల్లయ్య, హౌజింగ్ పీడీ భూక్యా శ్రీనివాస్, జిల్లా గ్రంథాలయ సంస్థ, మార్కెట్ చైర్మన్లు మహ్మద్ ఖాదర్ బాబా, యరగర్ల హన్మంతరావు, ఎంపీడీఓ అశోక్ కుమార్, తహసీల్దార్ శ్వేత, సర్పంచ్ శంకర్ నాయక్‌తో పాటు నాయకులు, ప్రజాప్రతినిధులు మానుకొండ రాధాకిషోర్, తాతా రఘురాం, తుపాకుల యలగొండస్వామి, నాగండ్ల దీపక్‌చౌదరి, సాధు రమేష్‌రెడ్డి, రాయల నాగేశ్వరరావు, దేవ్‌సింగ్, బోయినపల్లి లక్ష్మణ్, కొంటెముక్కల నాగేశ్వరరావు, బండి వెంకన్న, కమర్తపు మురళి, పాలపు వెంకటరమణ, చిరుమావిళ్ల నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.


