● శబరిమల భక్తులకు ప్రత్యేక బస్సులు ● కార్తీక మాసంలో పుణ్యక్షేత్రాలకు సైతం అందుబాటులో.. ● రీజియన్‌లోని ఏడు డిపోల నుంచి సర్వీసులు
ఖమ్మంమయూరిసెంటర్: పవిత్ర కార్తీక మాసంలో శివకేశవుల నామస్మరణతో ఆలయాలు మార్మోగుతున్నాయి. మరోవైపు భక్తులు అయ్యప్ప మాల ధరిస్తున్నారు. ఈక్రమాన శైవ క్షేత్రాలకు వెళ్లేవారితో పాటు శబరిమల వెళ్లేందుకు సిద్ధమవుతున్న మాలధారుల కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడిపించనుంది. సుఖవంతమైన, సురక్షితమైన ప్రయాణాన్ని అందించేలా రీజియన్‌లోని ఏడు డిపోల నుంచి ప్రత్యేక సర్వీసులను సిద్ధం చేశారు. కార్తీక సోమవారాలు, పౌర్ణమి సందర్భంగా పంచారామ క్షేత్రాల దర్శనంతో పాటు సత్యదేవుని సన్నిధి అయిన అన్నవరం, గిరి ప్రదక్షిణకు ప్రసిద్ధి చెందిన అరుణాచలం, ఇరుముడితో శబరిమల వెళ్లే మాలధారులు ఈ సర్వీసులను వినియోగించుకోవచ్చు. రీజియన్‌లోని ఖమ్మం, మధిర, సత్తుపల్లి, భద్రాచలం, కొత్తగూడెం, మణుగూరు, ఇల్లెందు డిపోల నుంచి భక్తుల రద్దీకి అనుగుణంగా సూపర్ లగ్జరీ, డీలక్స్ బస్సులను సమకూరుస్తారు.
సమీప డిపోల నుంచే ప్రయాణం
ఆధ్యాత్మిక యాత్రలకు వెళ్లాలనుకునే భక్తులు ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించి వ్యయప్రయాసలకు గురికాకుండా, ఆర్టీసీ బస్సులు సమకూరుస్తోంది. ఒకే గ్రామం, కాలనీ నుంచి సరిపడా సంఖ్యలో భక్తులు ముందుకొస్తే నేరుగా వారి ఊరి నుంచే ప్రత్యేక బస్సు నడిపిస్తారు. శబరిమల వెళ్లే అయ్యప్ప మాలధారుల కోసం నూతన సూపర్ లగ్జరీ బస్సులు సిద్ధం చేశారు.
నేటి నుంచి సర్వీసులు
కార్తీక మాసంలో అన్నవరం, పంచారామాలకు వెళ్లే భక్తుల కోసం ఆర్టీసీ సర్వీసులు ప్రతీ ఆదివారం రాత్రి డిపోల నుంచి బయలుదేరతాయి. భక్తులు సోమవారం పుణ్యక్షేత్రాలకు చేరుకొని దర్శనం అనంతరం తిరుగు ప్రయాణం కావొచ్చు. ఈ నెల 15, 22, 23, 29వ తేదీలతో పాటు డిసెంబర్ 6వ తేదీన ఆయా పుణ్యక్షేత్రాలకు రాత్రి 10 గంటలకు బస్సులు బయలుదేరతాయి. ఖమ్మం, భద్రాచలం, కొత్తగూడెం, మణుగూరు డిపోల నుంచి అన్నవరానికి డీలక్స్, పంచారామాలకు సూపర్ లగ్జరీ, మధిర, సత్తుపల్లి డిపోల నుంచి అన్నవరం, పంచారామాలకు డీలక్స్, ఇల్లెందు నుంచి అన్నవరం, పంచారామాలకు సూపర్ లగ్జరీ బస్సులు నడపనున్నారు. అలాగే, కార్తీక పౌర్ణమి ముందు రోజు రీజియన్‌లోని అన్ని డిపోల నుంచి పంచారామాలు, అన్నవరానికి సర్వీసులు ఉంటాయని అధికారుల తెలిపారు.


