శ్రీవారికి అభిషేకం, నిత్యకల్యాణం | - | Sakshi
Sakshi News home page

శ్రీవారికి అభిషేకం, నిత్యకల్యాణం

Nov 1 2026 12:21 AM | Updated on Nov 1 2026 12:21 AM

ఎర్రుపాలెం: మండలంలోని జమలాపురం శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో శనివారం ప్రత్యేక పూజలు జరిగాయి. తెల్లవారుజామునే స్వామి మూలవిరాట్‌తో పాటు ఆలయ ఆవరణలోని శ్రీవారి పాదానికి పంచామృతంతో అభిషేకం చేశారు. అనంతరం స్వామి, అలివేలు మంగ, పద్మావతి అమ్మవార్లను పట్టువస్త్రాలతో అలంకరించిన భక్తులు పెద్దసంఖ్యలో హాజరైన భక్తుల సమక్షాన నిత్యకల్యాణం, పల్లకీ సేవ నిర్వహించారు. కాగా, ఏపీ రాష్ట్రం ఎన్టీఆర్‌ జిల్లా కనుమూరు గ్రామానికి చెందిన గొర్రల సత్యనారాయణరెడ్డి – సుభద్ర దంపతులు ఆలయంలో నిత్యాన్నదానికి రూ.1,00,116 నగదును విరాళంగా అందజేశారు. ఈకార్యక్రమంలో వ్యవస్థాపక ధర్మకర్త ఉప్పల విజయదేవశర్మ, ప్రధాన అర్చకులు ఉప్పల శ్రీనివాసశర్మ, ఉప ప్రధాన అర్చకులు ఉప్పల మురళీమోహన్‌శర్మ, ఉద్యోగులు సోమయ్య, కృష్ణప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

వేగంగా భూముల రీసర్వే

పెనుబల్లి: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూములు రీసర్వే వేగంగా నిర్వహిస్తూ త్వరగా పూర్తయ్యేలా చూడాలని జిల్లా సర్వే అధికారి నాగభూషణం సూచించారు. పెనుబల్లి మండలం తాళ్లపెంటలో సర్వేను శనివారం ఆయన పరిశీలించి ఉద్యోగులకు సూచనలు చేశారు. భూవివాదాలను శాశ్వతంగా పరిష్కరించేలా చేపట్టిన సర్వేలో ఎలాంటి లోటుపాట్లు జరగకుండా చూడాలని తెలిపారు. రైతులు కూడా వారి ఉన్న పూర్తి ఆధారాలతో ఉద్యోగులకు సహకరించాలని సూచించారు. సర్వే పూర్తయితే భూమికి సంబంధించి సమస్త వివరాలతో భూ ఆధార్‌కార్డులు అందుతాయని తెలిపారు. సర్వేయర్‌ ఈశ్వరి, ఉద్యోగులు సత్యవాణి, ప్రవీణ్‌, స్వప్న, వీరబాబు పాల్గొన్నారు.

జిల్లాకు 20 కస్టమ్‌

హైరింగ్‌ సెంటర్లు

ఖమ్మంవ్యవసాయం: వ్యవసాయ యాంత్రీకరణ పథకం కింద జిల్లాకు 20 సంచార వ్యవసాయ యంత్ర కేంద్రాలు(కస్టమ్‌ హైరింగ్‌ సెంటర్స్‌) మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. యాంత్రీకరణ పథకం కింద జిల్లాకు రూ.3.04 కోట్లు కేటాయించగా, ఒక్కో కేంద్రానికి రూ.20 లక్షల వరకు రాయితీ లభించనుంది. రైతు ఉత్పత్తిదారుల సంఘాలు, పాల సహకార సంఘాలు, మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులను అర్హులుగా నిర్ణయించారు. ఈ కేంద్రాల్లో పవర్‌ టిల్లర్‌, రోటవేటర్‌, ఎంబీ నాగలి, పవర్‌ కలుపు తీత యంత్రం, రైతు డ్రోన్‌, కంబైన్‌ హార్వెస్టర్‌, పసుపు ఉడకబెట్టే – పాలిష్‌ యంత్రాలు, వరి ఆరబెట్టే యంత్రం, గడ్డి కట్టలు కట్టే తదితర 37 రకాల యంత్రాల కొనుగోలుకు అనుమతి ఉంది. ఈమేరకు ఆసక్తి ఉన్న సంఘాలు నవంబర్‌ మొదటి వారం నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవచ్చని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ధనసరి పుల్లయ్య తెలిపారు. ఆతర్వాత వ్యాపారుల ఎంపిక, ఆపై అధికారుల తనిఖీ తర్వాత ఖాతాలో రాయితీ జమ అవుతుందని వెల్లడించారు.

మెరుగైన ఫలితాల

సాధనకు కృషి

మధిర: ఇంటర్మీడియట్‌ వార్షిక పరీక్షల్లో మెరుగైన ఫలితాలు సాధించేలా అధ్యాపకులు ఇప్పటి నుంచే ప్రత్యేక శ్రద్ధతో బోధించాలని జిల్లా ఇంటర్మీడియట్‌ విద్యా శాఖాధికారి రవిబాబు సూచించారు. మధిర ప్రభుత్వ జూనియర్‌ కళాశాలను శనివారం తనిఖీ చేసిన ఆయన విద్యార్థుల హాజరు, బోధనపై ఆరా తీశాక అధ్యాపకులతో సమావేశమయ్యారు. విద్యార్థులు ప్రతీరోజు హాజరయ్యేలా పర్యవేక్షిస్తూ, వెనుకబడిన వారికి ప్రత్యేక తరగతులు నిర్వహించాలని తెలిపారు. అలాగే, మొదటి సంవత్సరం విద్యార్థులను ప్రాక్టికల్‌ పరీక్షలకు సిద్ధం చేయాలని చెప్పారు. ప్రిన్సిపాల్‌ జి.శంకర్‌, అధ్యాపకులు లత, పి.కమల, పి.అరుణ, బి.సుధ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement