ఖమ్మం సహకారనగర్: దీపావళి సందర్భంగా ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చేలా టపాసుల దుకాణాల కేటాయింపులో పారదర్శకత పాటించాలని కలెక్టర్ దివాకర టీ.ఎస్. సూచించారు. కలెక్టరేట్‌లో మంగళవారం ఆయన అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ, కేఎంసీ కమిషనర్ అభిషేక్ అగస్త్య, కల్లూరు సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్‌తో కలిసి షాపుల కేటాయింపు, భద్రతా ఏర్పాట్లపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ దివాకర మాట్లాడుతూ టపాసుల విక్రయాలు, వినియోగం సందర్భంగా ప్రమాదాలు జరగకుండా అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఈమేరకు అగ్నిమాపక, వైద్య శాఖల ఉద్యోగులు సిద్ధంగా ఉండాలని తెలిపారు. టపాసుల షాప్‌ల కేటాయింపులో అవకతవకలకు జరగకుండా లాటరీ విధానం అమలుచేయాలని సూచించారు. డివిజన్ స్థాయిలో సబ్ కలెక్టర్, ఆర్‌డీఓ ఆధ్వర్యాన సంబంధిత శాఖల అధికారులతో సమన్వయం చేసుకోవాలని తెలిపారు. కాగా, ఖమ్మంలో టపాసుల దుకాణాల ఏర్పాటుకు 224 దరఖాస్తులు అందగా, అందుబాటులో ఉన్న షాప్‌లను లాటరీ పద్ధతిలో కేటాయించనున్నట్లు వివరించారు. ఈసమావేశంలో డీఎంహెచ్‌ఓ రామారావు, కేఎంసీ అసిస్టెంట్ కమిషనర్ అనిల్‌కుమార్, డీపీఓ వినోద్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ దివాకర టీ.ఎస్.


