సభ్యత్వాల పేరిట గాలం | - | Sakshi
Sakshi News home page

సభ్యత్వాల పేరిట గాలం

Nov 4 2026 1:32 AM | Updated on Nov 4 2026 1:32 AM

● మత్స్య శాఖలో నిబంధనలకు విరుద్ధంగా జారీ ● రెండేళ్ల క్రితం కోమట్లగూడెంలో అక్రమంగా 89 సభ్యత్వాలు ● ఆ సమయాన ఇన్‌చార్జ్‌గా ఉన్న అధికారిపై సస్పెన్షన్‌ వేటు

నిబంధనలు ఏం చెబుతున్నాయి..

● మత్స్య శాఖలో నిబంధనలకు విరుద్ధంగా జారీ ● రెండేళ్ల క్రితం కోమట్లగూడెంలో అక్రమంగా 89 సభ్యత్వాలు ● ఆ సమయాన ఇన్‌చార్జ్‌గా ఉన్న అధికారిపై సస్పెన్షన్‌ వేటు

ఖమ్మంవ్యవసాయం: మత్స్య శాఖకు సంబంధించి ప్రభుత్వ పథకాల అమలు, బీమా సౌకర్యం, ఉపాధి అవకాశాలకు సభ్యత్వం అవసరం కావడంతో విపరీతమైన డిమాండ్‌ ఏర్పడింది. దీన్ని ఆసరాగా చేసుకుని జిల్లాలో సభ్యత్వాల జారీలో యథేచ్ఛగా అక్రమాలు సాగుతున్నాయి. మత్స్యకారుల సంక్షేమం, ఉపాధి కోసం ప్రభుత్వం మత్స్య సహకార సంఘాలను ఏర్పాటు చేసింది. ఈ సంఘాల్లో అర్హులైన వారిని సభ్యులుగా చేరుస్తారు. అలా సభ్యత్వం ఉన్నవారికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపల వేట, విక్రయానికి కేటాయించే వాహనాలు, ఇతర పథకాలు అందుతాయి. ప్రమాదవశాత్తు మరణించిన మత్స్యకారుల కుటుంబానికి రూ.5 లక్షల బీమా సౌకర్యం అమలవుతోంది.

ఇష్టారాజ్యంగా జారీ

నిబంధనలను విస్మరించి చింతకాని మండలం కోమట్లగూడెం మత్స్య సహకార సంఘం పరిధిలో 89మందికి సభ్యత్వాలు జారీ చేశారు. జిల్లా ఇన్‌చార్జ్‌ మత్స్యశాఖాధికారిగా ఆంజనేయస్వామి ఉన్న సమయాన ఈ సభ్యత్వాలు ఇచ్చారు. ఆయన 2022–24 కాలంలో జిల్లా అధికారిగా పనిచేసినా సభ్యత్వాలు ఇవ్వలేదు. ఆతర్వాత సూర్యాపేట జిల్లా అధికారిగా, మహబూబాబాద్‌ ఇన్‌చార్జిగా ఉంటూ అదనంగా ఖమ్మం బాధ్యతలు నిర్వర్తించిన సమయంలో టీ–మత్స్య పోర్టల్‌ యాప్‌లో 89 మందిని నమోదు చేశారు. దీనిపై సంఘ ప్రతినిధులు మంత్రి వాకిటి శ్రీహరి, డైరెక్టర్‌ నిఖిలకు ఫిర్యాదు చేయగా.. డిప్యూటీ డైరెక్టర్‌ సుజాత విచారణ జరిపారు. ఆమె ఇచ్చిన నివేదిక ఆధారంగా ఆంజనేయస్వామిని సస్పెండ్‌ చేస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు.

2021లోనూ ఇలాగే...

2021లో కూడా 17 మత్స్య సహకార సంఘాల పరిధిలో పలువురికి సభ్యత్వాలు ఇచ్చారు. ఇందులో 60 మందికి సరైన అర్హత లేకున్నా సభ్యత్వాలు ఇచ్చినట్టు బయటపడింది. నిబంధనలను తుంగలో తొక్కి ఉన్నతాధికారుల అనుమతి లేకుండా నూతన సభ్యత్వాలను జారీ చేసినట్లు తేలడంతో అప్పటి జిల్లా అధికారి షకీలా భానును సస్పెండ్‌ చేశారు.

500 సభ్యత్వాలు పెండింగ్‌

జిల్లాలో 900 వరకు జలాశయాలు ఉండగా, వీటి పరిధిలోని 237 మత్స్య సహకార సంఘాల్లో 16,644 మంది సభ్యులు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం వివిధ సంఘాల నుంచి మరో 500 సభ్యత్వాల సిఫారసులు పెండింగ్‌లో ఉన్నాయి. కమిటీల మధ్య సమన్వయ లోపం, ధ్రువీకరణ పత్రాల్లో సమగ్రత లేకపోవడం, రాజకీయ జోక్యం వంటి అంశాలు సభ్యత్వాల కేటాయింపునకు ఆటంవకంగా మారిందని తెలుస్తోంది. అయితే, కొందరు ఏకంగా హైకోర్టును ఆశ్రయించి సభ్యత్వాలు పొందారు. కాగా, ప్రస్తుతం పెండింగ్‌ ఉన్న దరఖాస్తులను ఉన్నతాధికారుల ఆదేశాలు, నిబంధనల మేరకే పరిశీలిస్తామని ప్రస్తుత జిల్లా మత్స్యశాఖ అధికారి ఏ.మల్లేశం స్పష్టం చేశారు.

నూతన సభ్యత్వాలకు మత్స్య సహకార సంఘాల కమిటీల తీర్మానంతో జిల్లా అధికారులకు సిఫారసు చేయాలి. జిల్లా అధికారులు పరిశీలించి ఉన్నతాధికారులకు పంపాలి. ఆతర్వాత వల వేయడం, లాగడం, తెప్పపై ఉండి వల విసరడం, ఈత కొట్టడం వంటివి పరీక్షించి నివేదికను రాష్ట్ర డైరెక్టర్‌కు సమర్పించాలి. అక్కడి నుంచి ఆమోదం లభిస్తేనే సభ్యత్వం ఇవ్వాల్సి ఉంటుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement