విద్యా, వైద్య రంగాలకు ప్రాధాన్యత | - | Sakshi
Sakshi News home page

విద్యా, వైద్య రంగాలకు ప్రాధాన్యత

Nov 4 2026 1:32 AM | Updated on Nov 4 2026 1:32 AM

జూన్‌ నాటికి వంద పడకల ఆస్పత్రి సిద్ధం

రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి

ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

కూసుమంచి: కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక పేదలకు మెరుగైన విద్య, వైద్యం అందించడాన్ని ప్రాధాన్యతగా తీసుకున్నామని రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. కూసుమంచి మండలం గంగబండతండా వద్ద రూ.45.50 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న వంద పడకల ఏరియా ఆస్పత్రి నిర్మాణ పనులను మంగళవారం ఆయన కలెక్టర్‌ దివాకర టీ.ఎస్‌.తో కలిసి పరిశీలించారు. నిర్మాణ పనుల పురోగతిని అఽధికారుల ద్వారా తెలుసుకున్న మంత్రి మాట్లాడుతూ వచ్చే జూన్‌ నెలాఖరుకు పనులను పూర్తి చేసి ఆస్పత్రిని అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు. గత ప్రభుత్వంలో అనారోగ్యం వస్తే పేదలు వైద్యం చేయించుకోలేక ఆర్థికంగా చితికిపోయే వారని తెలిపారు. కానీ తాము వచ్చాక ప్రభుత్వ ఆస్పత్రుల్లో నాణ్యమైన ఉచిత వైద్యం అందేలా భారీగా నిధులను కేటాయిస్తున్నామని చెప్పారు. పాలేరు నియోజకవర్గంలో వంద పడకల ఆస్పత్రి గత ప్రభుత్వంలో కలగా మిగిలితే తాము ఆ కలను నిజం చేస్తున్నామని తెలిపారు. ఈకార్యక్రమంలో డీసీహెచ్‌ఎస్‌ రాజశేఖర్‌, ఆర్‌డీఓ శ్రీనివాస్‌, వైద్యశాఖ ఈఈ ఉమామహేశ్వరరావు, తహసీల్దార్‌ సైదులు, సర్పంచ్‌లు వడిత్య రాజమ్మ, మేడిపల్లి విజయ, కాంగ్రెస్‌ మండల అద్యక్షులు బజ్జూరి వెంకటరెడ్డి, నాయకులు పాల్గొన్నారు.

పేదల ఆత్మగౌరవానికి ప్రతీక ఇందిరమ్మ ఇళ్లు

తిరుమలాయపాలెం: పేద ప్రజల ఆత్మగౌరవానికి ఇందిరమ్మ ఇళ్లు ప్రతీకగా నిలుస్తున్నాయని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. కలెక్టర్‌ దివాకరతో కలిసి తిరుమలాయపాలెం మండలంలోని దమ్మాయిగూడెంలో రెండో విడత లబ్ధిదారులు 187మందికి ఇళ్ల మంజూరు పత్రాలతో పాటు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ చెక్కులు పంపిణీ చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ అర్హులైన నిరుపేదలందరికీ కుల, మత, రాజకీయాలకు అతీతంగా ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తామని తెలిపారు. మండలంలో మొదటి విడత మంజూరైన 810 ఇళ్లలో 700 ఇళ్లు పూర్తయ్యాయని, చివరి నిరుపేదకు ఇల్లు అందే వరకు పథకం కొనసాగుతుందని వివరించారు. కలెక్టర్‌ దివాకర మాట్లాడుతూ పూర్తి అర్హత ఉన్న నిజమైన పేదలనే పారదర్శకంగా ఎంపిక చేస్తున్నామని తెలిపారు. అనంతరం ఏలువారిగూడెంలో ఎన్‌.నగేష్‌ – మంగమ్మ నిర్మించుకున్న ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశంలో మంత్రి పాల్గొనగా, ఏలువారిగూడెంలో రూ.2 కోట్లతో చేపట్టే బీటీ రోడ్డు, బీరోలు జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల ఆవరణలో రూ.48 లక్షలతో నిర్మిస్తున్న ఓహెచ్‌ఎస్‌ఆర్‌ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఆర్‌డబ్ల్యూఎస్‌, పీఆర్‌ ఎస్‌ఈలు శేఖర్‌రెడ్డి, జి.వెంకట్‌రెడ్డి, హౌజింగ్‌ పీడీ భూక్యా శ్రీనివాస్‌, ఆర్‌డీఓ ఎన్‌.శ్రీనివాస్‌, సిలార్‌ సాహెబ్‌, తహసీల్దార్‌ విల్సన్‌, ఆత్మ చైర్మన్‌ చావా శివరామకృష్ణతో పాటు నాయకులు, ప్రజాప్రతినిధులు రామసహాయం నరేష్‌రెడ్డి, బెల్లం శ్రీనివాస్‌, కొప్పుల అశోక్‌, వినోద, గుగులోతు తులసి, నర్సింహ, గుమ్మడి దేవభిక్ష, వనవాసం నరేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కాగా, ఎర్రగడ్డ గ్రామపంచాయతీ పరిధి గోపాలపురంలో విద్యుత్‌ శాఖ లైన్‌ ఇన్‌స్పెక్టర్‌ గడ్డికొప్పుల రాములు ఉద్యోగ విరమణ సన్మానంలో కూడా మంత్రి పాల్గొని మాట్లాడారు. ఎస్‌ఈ ఇనుగుర్తి శ్రీనివాసాచారి, ఏదులాపురం మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ పోకబత్తిని అనిత తదితరులు పాల్గొన్నారు.

ఖమ్మంరూరల్‌: రాష్ట్రంలో పేద ప్రజల సంక్షేమం, అభివృద్ధే ధ్యేయంగా పాలన సాగుతోందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఏదులాపురం మున్సిపాలిటీ పరిధి 14, 15, 16వ వార్డుల్లో రూ.312.90 లక్షలతో నిర్మించే అంతర్గత సీసీ రోడ్ల పనులకు కలెక్టర్‌ దివాకరతో కలిసి శంకుస్థాపన చేశాక మంత్రి మాట్లాడారు. గత 33 నెలల కాలంలో కేవలం తెల్ల వారుపల్లి ప్రాంతంలోనే అభివృద్ధి పనులకు రూ.16.86 కోట్లు వెచ్చించామన్నారు. అలాగే, 105 మందికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయడం ద్వారా పేదలకు అండగా నిలిచామని చెప్పారు.

భూముల సమగ్ర సర్వే

రాష్ట్రంలో సుమారు 125ఏళ్ల క్రితం భూముల సర్వే జరిగిందని, మళ్లీ ఇప్పుడు రాష్ట్రంలో ప్రతీ అంగుళాన్ని సర్వే చేసి భూములు ఉన్న ఆసాములకు భరోసా కల్పించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు మంత్రి పొంగులేటి అన్నారు. పాలేరు నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో సర్వేపై జరగనుందని తెలిపారు. సర్వే పూర్తయ్యాక యజమానులకు క్యూఆర్‌ కోడ్‌, మ్యాప్‌తో సహా అందించి ప్రతీ భూమికి భూధార్‌ నంబర్‌ కేటాయిస్తామని చెప్పారు. మద్దులపల్లి మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ హరినాధ్‌బాబు, హౌజింగ్‌ పీడీ భూక్యా శ్రీనివాస్‌, ఆర్‌డీఓ ఎన్‌.శ్రీనివాస్‌, మున్సిపల్‌ కమిషనర్‌ ఏ.శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement