జిల్లాలో రోజంతా ఎడతెరిపి లేకుండా వర్షం
చేతికి వచ్చిన దశలో పత్తి, వరికి నష్టం
నేడు భారీ వర్ష సూచనలతో అప్రమత్తత
మంగళవారం ఉదయం నుంచి రాత్రి 7 గంటల వరకు కురిసిన వర్షం (సెం.మీ.ల్లో)
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో జిల్లా అంతటా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. మురసు తుపానుతో జిల్లావ్యాప్తంగా మంగళవారం ఉదయం నుంచి రాత్రి వరకు వర్షం కురవగా.. చల్లగాలులు తోడయ్యాయి. ఏపీకి సరిహద్దుగా ఉన్న జిల్లాలోని మండలాల్లోనే ప్రభావం ఎక్కువగా ఉంది. వేంసూరు, ఎర్రుపాలెం, బోనకల్, సత్తుపల్లి, మధిర, కల్లూరు, పెనుబల్లి మండలాల్లో జల్లులుగా ప్రారంభమైన వాన అంతకంతకు పెరిగింది. కొద్దిరోజుల క్రితమే అర్నబ్ తుపాన్ రైతులను భయపెట్టింది. ఈ తుపాన్ ప్రభావం అంతగా లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఇంతలోనే మురసు రూపంలో వచ్చిన మరో తుపాన్ రైతులను ఆందోళనకు గురిచేస్తోంది. బుధవారం కూడా జిల్లావ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయనే వాతావరణ శాఖ సూచనలు జారీ చేసింది.
నిలకడగా వర్షం
జిల్లావ్యాప్తంగా మంగళవారం ఉదయం వర్షం ప్రారంభమైంది. ఎడతెరిపి లేకుండా రోజంతా వర్షం కురవగా.. వానకు చలి తోడయింది. కొద్దిరోజుల క్రితం అర్నబ్ తుపాన్ మొదలైనా అది దిశ మార్చుకోవడంతో ఒక్కరోజు వర్షంతో ముప్పు తప్పింది. ప్రస్తుతం మురసు తుపాన్‌తో మంగళ, బుధవారం భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. అయితే, మంగళవారం రోజంతా వాన కురిసినా భారీ వర్షం నమోదు కాలేదు. కానీ బుధవారం పరిస్థితి ఎలా ఉంటుందోనన్న భావనతో అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. లోతట్టు ప్రాంతాలపై దృష్టి సారించడంతో పాటు భారీ వర్షాలతో వరదలు సంభవిస్తే అందుకు అనుగుణంగా తీసుకోవాల్సిన చర్యలకు సిద్ధమయ్యారు.
‘నీరు’గారుతున్న పంటలు
తుపాన్ ప్రభావంతో చేతికి వచ్చిన పంటలు నీరు గారుతున్నాయి. ప్రధానంగా పత్తి చేలోనే తడిసి నీరు పట్టింది. ఇప్పటి వరకు రూ.9వేలకు పైగా క్వింటా ధర పలకగా తుపాన్ కారణంగా నాణ్యత, ధర పడిపోతుందని రైతుల్లో ఆందోళన నెలకొంది. ఇక వర్షంతో జిల్లాలోని చాలా ప్రాంతాల్లో వరి పైరు నేల వాలింది. గాలివానతో కొన్ని చోట్ల ధాన్యం నేల రాలింది. పంట కోతలకు సిద్ధమవుతున్న రైతులు ప్రస్తుత పరిస్థితిలో వెనకడుగు వేస్తున్నారు. అంతటా ముసురు పట్టడడంతో మరో రెండు రోజుల వరకు పంట కోతలు వాయిదా పడినట్టేనని తెలుస్తోంది.
మండలం వర్షపాతం
వేంసూరు 5.9
సత్తుపల్లి 4.7
కల్లూరు 3.4
మధిర 3.3
పెనుబల్లి 3.1
ఎర్రుపాలెం 3.1
బోనకల్ 2.9
వైరా 2.2


