జిల్లా ఉపాధి కల్పన శాఖాధికారి మాధవి
ఖమ్మం సహకారనగర్: విద్యార్థులు అంతర్లీనంగా దాగి ఉన్న ప్రతిభను గుర్తించి వెలికితీస్తే జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవచ్చని జిల్లా ఉపాధి కల్పన శాఖాధికారి ఎన్.మాధవి తెలిపారు. ఖమ్మంలోని ఎస్‌ఆర్ బీజీఎన్‌ఆర్ కళాశాల విద్యార్థులు పి.రిషిక, ఎన్.మీనాక్షి, పి.శ్రావణి, ఎస్.కే.ఉద్దండు సాహెబ్, బి.గణేష్ రాష్ట్ర స్థాయిలో జిజ్ఞాస కేంద్రం నిర్వహించిన రాష్ట్రస్థాయి పోటీలో గణితం విభాగం నుంచి ప్రథమ బహుమతి సాధించారు. ఈమేరకు మంగళవారం జరిగిన సమావేశంలో విద్యార్థులను వీరికి రూ.30వేల చెక్కు అందజేసి మాధవి మాట్లాడారు. క్రమశిక్షణ, ఏకాగ్రత, అధ్యయనానికి తోడు తల్లిదండ్రులు, గురువులు చూపించే మార్గంలో నడిస్తే విజయాలు సొంతమవుతాయని తెలిపారు. కళాశాల ప్రిన్సిపాల్ మహ్మద్ జాకీరుల్లా అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జిజ్ఞాస కోఆర్డినేటర్ డాక్టర్ ఎం.పిచ్చయ్యతో పాటు అధ్యాపకులు ఏఎల్‌ఎన్.శాస్త్రి, సునంద, సత్యవతి, కనకదుర్గ, శ్రీనివాస్, బంగారి, శ్రీనివాస శరీన్ తదితరులు పాల్గొన్నారు.
పారామెడికల్ కోర్సుల్లో ప్రవేశ గడువు పొడిగింపు
ఖమ్మం వైద్యవిభాగం: ప్రభుత్వ మెడికల్ కళాశాలలో కొనసాగుతున్న డిప్లొమా ఇన్ అనస్థీషియా టెక్నీషియన్, డిప్లొమా ఇన్ మెడికల్ ఇమేజింగ్ టెక్నీషియన్ కోర్సుల్లో ప్రవేశాల గడువును ఈనెల 13వరకు పొడిగించారు. రెండేళ్ల కాల వ్యవధితో ఈ కోర్సులు కొనసాగుతున్నాయని ప్రిన్సిపాల్ డాక్టర్ టి.శంకర్ తెలిపారు. రెండు కోర్సుల్లో 30 సీట్ల చొప్పున 60 సీట్లు అందుబాటులో ఉన్నాయని, బైపీసీ విద్యార్థులకు మొదటి ప్రాధాన్యత ఇవ్వనుండగా ఆ తర్వాత ఎంపీసీ, ఇతర కోర్సులు పూర్తిచేసిన విద్యార్థులకు సీట్లు కేటాయిస్తామని వెల్లడించారు. ఆసక్తి ఉన్న వారు వివరాల కోసం కళాశాల కార్యాలయంలో సంప్రదించాలని ప్రిన్సిపాల్ సూచించారు.
స్కాలర్‌షిప్ దరఖాస్తులు పరిష్కరించాలి
ఖమ్మంమయూరిసెంటర్: ఎస్సీ, బీసీ, మైనారిటీ సంక్షేమ శాఖల్లో విద్యార్థుల స్కాలర్‌షిప్లకు సంబంధించి ఆధార్ సీడింగ్ పూర్తి చేయాలని సాంఘిక సంక్షేమ శాఖ డీడీ జ్యోతి సూచించారు. ఖమ్మంలోని అంబేద్కర్ భవన్‌లో ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల ప్రిన్సిపాళ్లతో మంగళవారం సమావేశమైన ఆమె మాట్లాడుతూ కళాశాల స్థాయిలో పెండింగ్ దరఖాస్తులను పరిష్కరించడంతో పాటు జిల్లా అధికారి కార్యాలయానికి ఫార్వర్డ్ చేయాలని తెలిపారు. విద్యార్థుల దరఖాస్తులు, అవసరమైన పత్రాలను పరిశీలించాలకే ఫార్వర్డ్ చేయాలని స్పష్టం చేశారు. కాగా, విద్యార్థుల ఆధార్ కార్డును బ్యాంకు ఖాతా నంబర్‌తో అనుసంధానంలో ఇబ్బందులు ఎదురైతే ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్‌లో ఖాతా తెరవచ్చని బ్యాంకు మేనేజర్ రాజేష్ తెలిపారు. ఏదైనా కళాశాలలో 20 మందికి పైగా విద్యార్థులు ఉంటే తమ సిబ్బంది నేరుగా వస్తారని పేర్కొన్నారు. ఈ సమావేశంలో సంక్షేమ శాఖల ఉద్యోగులు మహ్మద్ అబ్దుల్ రవూఫ్, అజ్మీరా గోపీచంద్ నాయక్, వెక్కిరాల శ్రీనివాస్, మహ్మద్ అస్లాంఖాన్, శాంతం రవికిరణ్, కె.పవన్‌కుమార్, యాకూబ్‌పాషా, మల్లారెడ్డి, మురహరి పాల్గొన్నారు.
బొగ్గు ఉత్పత్తికి ఆటంకం
సత్తుపల్లి: తుపాన్ ప్రభావంతో సత్తుపల్లిలోని సింగరేణి గనుల్లో మంగళవారం బొగ్గు ఉత్పత్తికి ఆటంకం ఏర్పడింది. జేవీఆర్ ఓసీలో 40వేల టన్నులు, కిష్టారం ఓసీలో 8వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. అంతేకాక జేవీఆర్ ఓసీలో 1.45లక్షల క్యూబిక్ మీటర్లు, కిష్టారంలో 45 వేల క్యూబిక్ మీటర్ల మట్టి వెలికితీత పనులకు అడ్డంకి ఏర్పడింది.


