● మెడికల్ కాలేజీ, జీజీహెచ్ అనుసంధానంగా నిర్మాణం
రూ.3.25 కోట్ల నిధులు కేటాయింపు
ఖమ్మం వైద్యవిభాగం: ఖమ్మం ప్రభుత్వ జనరల్ ఆస్పత్రితో మెడికల్ కాలేజీని అనుసంధానిస్తూ చేపట్టిన ఫుట్ ఓవర్ బ్రిడ్జి(ఎఫ్ఓబీ) నిర్మాణ పనులు చకచకా జరుగుతున్నాయి. ఈమేరకు శనివారం బ్రిడ్జికి సంబంధించిన స్తంభాలను భారీ క్రేన్లతో అమర్చారు. ఎఫ్ఓబీ నిర్మాణానికి ప్రభుత్వం గతంలో నిధులు కేటాయించింది. ఈ ఏడాది మార్చిలో శంకుస్ధాపన చేయగా ఇప్పటికే ఆస్పత్రి, కాలేజీలో పిల్లర్లు నిర్మించారు. ఆ తర్వాత పనులు ఆగిపోగా మళ్లీ ఇటీవల ప్రారంభించి చకచకా చేపడుతున్నారు.
రాకపోకలు సులువయ్యేలా...
మెడికల్ కళాశాలలో ప్రస్తుతం 400మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరు ఆస్పత్రికి వెళ్లివచ్చే క్రమాన నిత్యం రద్దీ ఉండే రోడ్డును దాటాల్సి రావడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అలాగే ప్రొఫెసర్లు, అసోసియేట్, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, బోధనేతర సిబ్బంది కూడా అటూఇటు తిరగాల్సి వస్తోంది. ఈక్రమాన ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి రూ.3.25 కోట్లు కేటాయించింది. పూర్తిగా ఇనుప స్తంభాలతో ఈ బ్రిడ్జి నిర్మించడంతో పాటు రెండు వైపులా లిఫ్ట్లు అమర్చనున్నారు. మరో నెలలో బ్రిడ్జి నిర్మాణం పూర్తవుతుందని ఇంజనీరింగ్ విభాగం అధికారులు వెల్లడించారు.


