ఖమ్మం సహకారనగర్: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించి ఓటర్ల నమోదుకు ఈనెల 6వ తేదీ తర్వాత కూడా అవకాశం ఉంటుందని రాష్ట్ర ఎన్నికల అదనపు సీఈఓ డాక్టర్ వాసం వెంకటేశ్వర్‌రెడ్డి తెలిపారు. కలెక్టరేట్‌లో శనివారం కలెక్టర్ దివాకర టీ.ఎస్‌తో కలిసి ఓటర్ల నమోదుపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓటరుగా నమోదుకు వచ్చిన దరఖాస్తుల పరిశీలన వేగంగా చేపట్టాలని సూచించారు. 2023 అక్టోబర్ 31 నాటికి డిగ్రీ పూర్తి చేసిన వారి ఒరిజినల్ డిగ్రీ సర్టిఫికెట్ అందుబాటులో లేకపోతే సంబంధిత విద్యాసంస్థ అధిపతి ధ్రువీకరించిన సర్టిఫికెట్‌ను కూడా పరిగణనలోకి తీసుకోవాలని తెలిపారు. ఓటరు దరఖాస్తు గడువు ఈనెల 6తో ముగియదని, ముసాయిదా ఓటరు జాబితా ప్రచురణ అనంతరం డిసెంబర్ 10వ తేదీ వరకు క్లెయిమ్‌లు, అభ్యంతరాల రూపంలో దరఖాస్తులు సమర్పించేందుకు అవకాశం ఉందని చెప్పారు. అభ్యర్థుల నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ నాటికి కూడా ఫారం–18 దరఖాస్తులు సమర్పిస్తే నిబంధనల ప్రకారం స్వీకరిస్తామనే అంశాన్ని పార్టీల ప్రతినిధులు, పట్టభద్రులకు అవగాహన కల్పించాలని సూచించారు. ఇదే సమయాన ఒకే ప్రాంతం నుంచి, ఒకే ఐడీ ద్వారా వందల సంఖ్యలో దరఖాస్తులు వస్తే అప్రమత్తంగా వ్యవహరించాలని తెలిపారు. అనంతరం కలెక్టర్ దివాకర మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటివరకు పట్టభద్రుల నుంచి 73,898 దరఖాస్తులు అందాయని, వీటి విచారణ, పోలింగ్ కేంద్రాల గుర్తింపుపై దృష్టి సారించామని వివరించారు. ఈ సమావేశంలో ఖమ్మం, భద్రాద్రి అదనపు కలెక్టర్లు పి.శ్రీనివాసరెడ్డి, డి.వేణుగోపాల్, కల్లూరు, భద్రాచలం సబ్ కలెక్టర్లు అజయ్‌యాదవ్, మృణాల్ శ్రేష్ఠ, ఖమ్మం, కొత్తగూడెం ఆర్‌డీఓలు ఎన్.శ్రీనివాస్, మధు, ఎన్నికల విభాగం ఉద్యోగులు ఎం.ఏ.రాజు, అన్సారీ పాల్గొన్నారు.
అదనపు సీఈఓ వెంకటేశ్వర్‌రెడ్డి


