ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల ఆందోళన | - | Sakshi
Sakshi News home page

ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల ఆందోళన

Oct 29 2026 12:12 AM | Updated on Oct 29 2026 12:12 AM

● 20 ఏళ్లుగా విధులు నిర్వర్తిస్తున్నా భద్రత కరువు ● సమస్యలు పరిష్కరించాలనే డిమాండ్‌తో నిరవధిక సమ్మె ప్రధాన డిమాండ్లు

ఉద్యోగుల సమస్యలపై

ప్రభుత్వం స్పందించాలి

● 20 ఏళ్లుగా విధులు నిర్వర్తిస్తున్నా భద్రత కరువు ● సమస్యలు పరిష్కరించాలనే డిమాండ్‌తో నిరవధిక సమ్మె

చుంచుపల్లి: జాతీయ ఆరోగ్య మిషన్‌(ఎన్‌హెచ్‌ఎం) ఉద్యోగులు రెండు దశాబ్దాలుగా సేవలందిస్తున్నా క్రమబద్ధీకరణకు నోచుకోవడంలేదు. సరైన వేతనాలు, ఆరోగ్య భద్రత, ఇతర ప్రయోజనాలు కూడా లభించడంలేదు. ఈ నేపథ్యంలో తమకు న్యాయం చేయాలని రాష్ట్రవ్యాప్తంగా సమ్మె చేపడుతున్నారు. ఈమేరకు ఉమ్మడి జిల్లాలో కూడా ఉద్యోగులు నిరవధిక సమ్మె చేపట్టారు. ఇందులో భాగంగా 78 కేడర్ల పరిధిలో ఉద్యోగులు డిమాండ్ల సాధనకు ఈనెల 13 నుంచి ఆందోళనలు చేపడుతున్నారు. అర్నాబ్‌ తుపాన్‌ నేపథ్యంలో భద్రాద్రి జిల్లాలో కలెక్టర్‌ ఆదేశాల మేరకు బుధ, గురువారాల్లో అత్యవసర వైద్య సేవలకు మినహాయింపు ఇస్తూ నిరసనలకు తాత్కాలిక విరామం ఇచ్చారు. శుక్రవారం నుంచి మళ్లీ ధర్నా చౌక్‌ వద్ద నిరవధిక సమ్మె కొనసాగించనున్నట్లు ఉద్యోగులు వెల్లడించారు.

వివిధ ఆస్పత్రుల్లో సేవలు

ఎన్‌హెచ్‌ఎం సిబ్బంది జిల్లా ఆస్పత్రులు, సామాజిక ఆరోగ్య కేంద్రాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పల్లె దవాఖానాలు, బస్తీ దవాఖానాల్లో వైద్యులు, నర్సులు, ఏఎన్‌ఎంలు, పారామెడికల్‌ సిబ్బంది, ఫార్మసిస్టులు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, సాంకేతిక సిబ్బందిగా సేవలందిస్తున్నారు. ప్రభుత్వ ఆరోగ్య కార్యక్రమాలను ప్రజలకు చేరువ చేస్తున్నారు. కోవిడ్‌ పరీక్షలు, వ్యాక్సినేషన్‌లో కీలకంగా పనిచేశారు. రోగ్య మహిళ, పల్లె దవాఖానా, బస్తీ దవాఖానా వంటి సేవల్లోనూ భాగస్వాములవుతున్నారు. కాగా, ఎన్‌హెచ్‌ఎం సిబ్బంది సమ్మెతో ప్రభుత్వ వైద్యారోగ్య వ్యవస్థలో పనిభారం పెరుగుతోంది. క్షేత్రస్థాయిలో అందించే సేవలకు ఆటంకాలు ఏర్పడుతున్నాయి.

●ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులందరినీ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి.

●సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలి. ప్రతీ కేడర్‌కు వేతన నిర్ధారణ చేసి, 100 శాతం గ్రాస్‌ శాలరీ చెల్లించాలి.

●జీఓ 1195కు సంబంధించి వేతనాల్లో తలెత్తిన సమస్యలను పరిష్కరించి, పెంచిన వేతనాలు అమలు చేయాలి. కాంట్రాక్టు ఉద్యోగులను ఔట్‌సోర్సింగ్‌ విధానంలోకి మార్చకుండా స్టేట్‌ హెల్త్‌ సొసైటీ ద్వారా వేతనాలు ఇవ్వాలి.

●ప్రతి నెలా ఐదో తేదీలోపు వేతనాలు విడుదల చేయాలి. పెండింగ్‌లో ఉన్న 5 శాతం వార్షిక ఇంక్రిమెంట్‌, 8 శాతం లాయల్టీ బోనస్‌ మంజూరు చేయాలి.

●ఈహెచ్‌ఎస్‌, గ్రూప్‌ పర్సనల్‌ యాక్సిడెంట్‌ ఇన్సూరెన్స్‌ స్కీమ్‌ (జీపీఏఐఎస్‌) వర్తింపజేయాలి.

●మహిళా ఉద్యోగులందరికీ 180 రోజుల వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు మంజూరు చేయాలి.

●విధుల్లో ఉండగా ఉద్యోగి మరణిస్తే కుటుంబానికి రూ.50 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించడంతోపాటు కుటుంబ సభ్యులకు కారుణ్య నియామకంలో ఉద్యోగం ఇవ్వాలి.

ఖమ్మంవైరారోడ్‌: ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం వెంటనే స్పందించి పరిష్కరించాలని మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ బి.చంద్రావతి డిమాండ్‌ చేశారు. ఖమ్మంలో జాతీయ ఆరోగ్య మిషన్‌(ఎన్‌హెచ్‌ఎం) ఉద్యోగులు చేపట్టిన నిరవధిక సమ్మె శిబిరాన్ని బుధవారం ఆమె సందర్శించి మాట్లాడారు. భారీ వర్షాలు కురుస్తున్నప్పటికీ ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులు ఆందోళన కొనసాగించడం వారి సమస్యల తీవ్రతకు నిదర్శనమని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల సమ్మె 16వ రోజుకు చేరినా ప్రభుత్వం స్పందించకపోవడం సరికాదని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement