ఆట మొదలైంది! | - | Sakshi
Sakshi News home page

ఆట మొదలైంది!

Oct 29 2026 12:12 AM | Updated on Oct 29 2026 12:12 AM

ఆతిథ్యం ఇవ్వడం సంతోషం

మహిళా క్రీడాకారుల హోరాహోరీ పోరు

సత్తుపల్లి: కబడ్డీ.. కబడ్డీ అంటూ కూత, పాయింట్ల కోసం పోటీ పడుతున్న క్రీడాకారులకు తోడు క్రీడాభిమానుల కేరింతలోనే సత్తుపల్లి హోరెత్తింది. సత్తుపల్లిలో ఏర్పాటుచేసిన 73వ రాష్ట్రస్థాయి మహిళా కబడ్డీ పోటీలు బుధవారం ప్రారంభమయ్యాయి. జిల్లా కబడ్డీ అసోసియేషన్‌ – మువ్వా విజయ్‌బాబు యూత్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ పోటీల్లో భాగంగా తొలుత రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పుట్టినరోజు సందర్భంగా కేక్‌ కట్‌ చేశారు. అనంతరం పోటీలను సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్‌ మట్టా రాగమయి దయానంద్‌, టీజీఐడీసీ మాజీ చైర్మన్‌ మువ్వా విజయ్‌బాబు ప్రారంభించారు.

ఖమ్మం జట్టు బోణీ

కబడ్డీ టోర్నీకి 33 జిల్లాల నుంచి 34 జట్లు హాజరయ్యాయి. తుపాన్‌ హెచ్చరికలతో వర్షం కురిసినా ఇబ్బంది రాకుండా జర్మన్‌ టెక్నాలజీతో టెంట్లు, సింథటిక్‌ మ్యాట్లు ఏర్పాటుచేయగా,, తిలకించేందుకు వచ్చిన వారి కోసం రేకుల షెడ్లు వేయించారు. తొలిరోజు ఉదయం ఖమ్మం – పెద్దపల్లి మధ్య మ్యాచ్‌ జరగగా ఖమ్మం జిల్లాజట్టు 45 పాయింట్లతో ఘనవిజయం సాధించింది. ఆతర్వాత రంగారెడ్డి – ములుగు మధ్య మ్యాచ్‌లో రంగారెడ్డి, హైదరాబాద్‌ – మెదక్‌ మధ్య మ్యాచ్‌లో హైదరాబాద్‌, వరంగల్‌ – నాగర్‌కర్నూల్‌ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో నాగర్‌ కర్నూల్‌ గెలిచింది. తొలిరోజు మొత్తంగా 20 మ్యాచ్‌లు నిర్వహించారు. ఇక రెండో రోజైన గురువారం లీగ్‌, నాకౌట్‌ మ్యాచ్‌లు నిర్వహిస్తారు. అలాగే, చివరి రోజైన శుక్రవారం సెమీ ఫైనల్స్‌, ఫైనల్స్‌ నిర్వహించనున్నారు. ఈకార్యక్రమంలో మున్సిపల్‌ చైర్పర్సన్‌ ఎం.డీ.రెహానా కమల్‌పాషా, కబడ్డీ అసోసియేషన్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, జిల్లా కార్యదర్శి కటికాల క్రిస్టోఫర్‌బాబు, భద్రాద్రి జిల్లా కార్యదర్శి కె.స్వాతిముత్యంతో పాటు సీహెచ్‌.సుధాకర్‌, తోట సుజలరాణి, మందపాటి ముత్తారెడ్డి, దోమా ఆనంద్‌బాబు, భీమిరెడ్డి సుబ్బారెడ్డి, గాదె చెన్నారావు, ఉడతనేని అప్పారావు, ఎం.డీ.కమల్‌పాషా, మట్టా ప్రసాద్‌, కూకలకుంట నాని, పీఈటీలు, పీడీలు, కోచ్‌లు పాల్గొన్నారు.

రాష్ట్రస్థాయి మహిళా కబడ్డీ పోటీలకు సత్తుపల్లి ఆతిథ్యం ఇవ్వడం సంతోషంగా ఉందని ఎమ్మెల్యే రాగమయి పేర్కొన్నారు. రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన మహిళా క్రీడాకారులకు అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయడం అభినందనీయమని తెలిపారు. గెలుపోటములను సమానంగా స్వీకరించి క్రీడా స్ఫూర్తితో ముందుకు సాగాలని సూచించారు. టీజీఐడీసీ మాజీ చైర్మన్‌ విజయ్‌బాబు మాట్లాడుతూ రాష్ట్ర స్థాయి కబడ్డీ టోర్నీని మంత్రి పొంగులేటి జన్మదినం పురస్కరించుకొని ఏర్పాటు చేశామని తెలిపారు.

సత్తుపల్లిలో రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలు ప్రారంభం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement