కూసుమంచి: అతివేగంగా వెళ్తున్న డీసీఎం ముందు ఉన్న ట్రాక్టర్‌ను ఢీకొట్టడంతో ట్రాక్టర్ నడుపుతున్న యువకుడు మృతి చెందిన ఘటన ఇది. ఖమ్మం – సూర్యాపేట జాతీయ రహదారిపై మంగళవారం రాత్రి జరిగిన ఈ ప్రమాదం వివరాలు... కూసుమంచి మండలం హట్యాతండాకు చెందిన గుగులోత్ సురేష్(30) ట్రాక్టర్‌పై ఖమ్మం వరిగడ్డి తీసుకెళ్లి తిరిగి ఇంటికి వస్తున్నాడు. ఈక్రమాన జుజుల్‌రావుపేట సమీపంలో వెనక నుంచి వేగంగా వచ్చిన డీసీఎం ట్రాక్టర్‌ను ఓవర్‌టేక్ చేసే క్రమాన ఇంజిన్‌ను ఢీకొట్టింది. ఘటనలో ఇంజిన్ అదుపుతప్పి బోల్తా పడగా ట్రాక్టర్ నడుపుతున్న సురేష్ తీవ్ర గాయాలతో మృతి చెందాడు. ట్రాక్టర్ ట్రక్కు ఇంజిన్ నుంచి విడిపోయినా బోల్తా పడకపోవడంతో అందులో ఉన్న కిషన్, శంకర్ గాయాలతో బయటపడ్డారు. కాగా, సురేష్‌కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
మోటార్ ఆన్ చేస్తుండగా విద్యుదాఘాతంతో...
బోనకల్: ఇంటి ఆవరణలోని మోటార్ ఆన్ చేస్తుండగా మోటార్‌కు విద్యుత్ సరఫరా కావడంతో షాక్‌కు గురైన వ్యక్తి వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. మండలంలోని చిన్నబీరవల్లికి చెందిన పేరబత్తిని యాకోబ్(63) తన ఇంటి ఆవరణంలో భూగర్బ నీటితొట్టి ఏర్పాటు చేసుకున్నాడు. రెండురోజులుగా గ్రామంలో తాగునీటి సరఫరా నిలిచిపోవడంతో తొట్టిలో నిల్వ ఉన్న నీటిని మోటార్ ద్వారా ట్యాంక్‌కు ఎక్కించేందుకు సిద్ధమయ్యాడు. అయితే, వర్షంతో మోటార్ తడిచి విద్యుత్ సరఫరా అవుతున్న విషయాన్ని గుర్తించిన యాకోబు మోటార్‌ను ముట్టుకోవడంతో షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కళ్ల మందే ఇంటి పెద్ద మృతి చెందడంతో వారు కన్నీరుమున్నీరుగా విలపించారు.
చికిత్స పొందుతున్న లారీ డ్రైవర్...
కూసుమంచి: ఖమ్మం – సూర్యాపేట జాతీయ రహదారిపై మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రగాయాల పాలైన లారీ డ్రైవర్ చికిత్స పొందుతూ బుధదవారం తెల్లవారుజామున మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు... మండలంలోని జుజుల్‌రావుపేట సమీపాన జాతీయ రహదారిపై మంగళవారం రాత్రి ట్రాక్టర్‌ను డీసీఎం ఢీకొట్టగా పోలీసులు వాహనాలను సర్వీసు రోడ్డుపైకి మళ్లించారు. ఈక్రమాన ఖమ్మం వైపు నుంచి హైదరాబాద్ వెళ్తున్న లారీ సర్వీసు రోడ్డుపై నిలిపి ఉంచిన కంటైనర్ లారీని వెనక నుంచి ఢీకొట్టింది. దీంతో లారీ డ్రైవర్ అయ్యన్న బాబు(58) తీవ్రంగా గాయపడడంతో ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. కాగా, అయ్యన్నబాబు స్వస్థలం ఏపీలోని అనకాపల్లి జిల్లా లింగభూపాలం అగ్రహారం గ్రామంగా గుర్తించి, ఆయన కుమారుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై సతీష్ తెలిపారు.
గాయపడిన వృద్ధుడు...
ఖమ్మంరూరల్: మండలంలోని కోదాడ క్రాస్ వద్ద ద్విచక్రవాహనం ఢీకొన్న ఘటనలో గాయపడిన తేజావత్ లక్ష్మా(56) చికిత్స పొందుతూ మృతి చెందాడు. నేలకొండపల్లి మండలం శంకరగిరితండాకు చెందిన లక్ష్మా ఈనెల 27న ఖమ్మం నుంచి తల్లంపాడు వైపుకు నడిచి వెళ్తుండగా కోదాడ క్రాస్ వద్ద కూసుమంచి వైపు నుంచి ఖమ్మం వస్తున్న ద్విచక్రవాహనం ఎదరుగా ఢీకొట్టింది. ఘటనలో తీవ్రగాయాల పాలైన లక్ష్మాకు ఖమ్మంలో చికిత్స అనంతరం వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు. ఆయన కుమార్తె బి.కుమారి ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు సీఐ ముష్క రాజు తెలిపారు.


