ఖమ్మం మామిళ్లగూడెం: సామాజికంగా, ఆర్థికంగానే కాక విద్యాపరంగానూ బీసీలను పాలకవర్గాలు అణచి వేస్తున్నాయని మున్నూరుకాపు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పుట్టం పురుషోత్తమరావు ఆవేదన వ్యక్తం చేశారు. ఖమ్మంలోని మున్నురుకాపు హాస్టల్ ప్రాంగణంలో బుధవారం జరిగిన జిల్లా కార్యవర్గ, అనుబంధ సంఘాల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలోని బీసీల విషయంలో ప్రభుత్వం అణచివేసే ధోరణి అవలంభిస్తోందని విమర్శించారు. ఎన్నికలు వచ్చినప్పుడు బీసీల జపం చేస్తుండగా, అధికారంలోకి వచ్చాక ప్రాతినిధ్యం కల్పించడం లేదని తెలిపారు. రాష్ట్రంలో 60 శాతంగా ఉన్న బీసీల్లో 22 శాతం మున్నూరుకాపులు ఉన్నందున, తక్కువ శాతంగా ఉన్నారని చూపడం సరికాదన్నారు. ఇకనైనా బీసీలను ఓటు బ్యాంకుగా చూసే రాజకీయాలకు ముగింపు పలకాలని, రాష్ట్ర మంత్రి వర్గంలో మున్నూరు కాపులు ఒకరికై నా అవకాశం కల్పించాలని కోరారు. సంఘం జిల్లా గౌరవ అధ్యక్షుడు కొత్తా సీతారాములు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆకుల గాంధీ, రాష్ట్ర కార్యదర్శి ఆవుల రామారావు, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు శీలంశెట్టి వీరభద్రం, పసుపులేటి దేవేందర్‌తో పాటు నాయకులు కంచి సత్యనారాయణ, పగడాల మంజుల, పారా నాగేశ్వరరావు, పొదిల రవికుమార్, పసుపులేటి నాసరయ్య, మడూరి పూర్ణచందర్‌రావు, తోట రమేష్, పారా ఉదయ్‌కుమార్, తోట వీరభద్రం, సాయికృష్ణ, రమాదేవి, వెంకటేశ్వరరావు, ఆళ్ల కృష్ణ, మేకల నాగేందర్ తదితరులు పాల్గొన్నారు.
మున్నూరుకాపు సంఘం
రాష్ట్ర అధ్యక్షుడు పురుషోత్తమరావు


