ఖమ్మంరూరల్: చేసిన పనికి బిల్లు మంజూరు కాకుండా అధికారి ఇబ్బంది పెడుతున్నాడంటూ ఓ కాంట్రాక్టర్ బుధవారం రూరల్ విద్యుత్ శాఖ డీఈ కార్యాలయం ఎదుట పురుగుమందు డబ్బాతో నిరసన తెలిపాడు. కాంట్రాక్టర్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఏదులాపురం మున్సిపల్ పరిధి వెంకటగిరి, చిన్నతండాలో ఇళ్లపై ఉన్న విద్యుత్లైన్లను మార్చడానికి ఆవుల మల్లయ్య కాంట్రాక్ట్ తీసుకున్నాడు. కొంతవరకు పనులు చేయగా, చిన్నతండాలో ఇళ్ల మధ్య, పైన ఉన్న లైన్లను మార్చే పనులను గ్రామస్తులు అడ్డుకున్నారు. దీంతో ఈనెల 7న విద్యుత్ డీఈ నాగేశ్వరరావు చిన్నతండాలో వాసులతో చర్చించినా గ్రామస్తులు అంగీకరించలేదు. ఇప్పటికే రూ.22లక్షలు సామగ్రితో పాటు కూలీలకు పెట్టుబడి పెట్టినందున అంత మేర బిల్లు చేయాలని మల్లయ్య కోరగా, గురువారం ఎల్ఓసీ ఆన్లైన్ చేస్తామనడంతో కార్యాలయానికి వచ్చాడు. తీరా వచ్చాక రూ.50వేలు డిమాండ్ చేశారని ఆరోపిస్తూ మల్లయ్య.. తనకు చావే శరణ్యమంటూ పురుగుల మందు డబ్బాతో కార్యాలయం ఎదుట బైఠాయించాడు. దీంతో ఏడీ విషయాన్ని ఎస్ఈ శ్రీనివాసచారి దృష్టికి తీసుకెళ్లగా ఆయన బిల్లు మంజూరు చేస్తామని చెప్పడంతో ఆందోళన విరమించాడు. ఈవిషయమై డీఈ నాగేశ్వరరావును వివరణ కోరగా కాంట్రాక్టర్ను డబ్బులు అడిగిన మాట అవాస్తవమని, బిల్లు మంజూరు కోసం ఎల్ఓసీ పంపించినట్లు తెలిపారు.
బిల్లు ఇవ్వడం లేదని కాంట్రాక్టర్ నిరసన


