కల్లూరు రూరల్: కల్లూరు మండలంలోని వెన్నవెల్లి గుట్ట వద్ద మట్టి తవ్వుతుండగా పైకప్పు కూలడంతో జేసీబీ డ్రైవర్ ఆచూకీ గల్లంతైంది. వెన్నవెల్లి గుట్ట వద్ద కొద్దినెలలుగా మట్టి తవ్వుతూ కల్లూరు మండలంతో పాటు పెనుబల్లి, తల్లాడ మండలాల్లో నిర్మిస్తున్న రహదారులకు రవాణా చేస్తున్నారు. ఈ నేపథ్యాన శనివారం సాయంత్రం గుట్టకు సొరంగం మాదిరి చేసి లోపల జేసీబీతో మట్టి తవ్వుతుండగా ఒక్కసారిగా పైభాగం కూలిపడింది. దీంతో జేసీబీ మట్టితో నిండిపోగా, డ్రైవర్ అందులో చిక్కుకున్నాడు. ఈమేరకు సదరు కాంట్రాక్టర్ మరికొన్ని జేసీబీలను రప్పించి సహాయక చర్యలు చేపట్టిన రాత్రి వరకు డ్రైవర్ ఆచూకీ లభ్యం కాలేదు. కల్లూరు ఎస్సై హరిత చేరుకుని పర్యవేక్షిస్తున్నారు.
రాత్రివరకు తెలియని ఆచూకీ


