సంతకంపై మరక ! | - | Sakshi
Sakshi News home page

సంతకంపై మరక !

Oct 23 2026 12:21 AM | Updated on Oct 23 2026 12:21 AM

● గెజిటెడ్‌ సంతకాలు చేసిన అధికారులపై కేసు ● కొంపముంచిన నకిలీ ధ్రువీకరణ పత్రాలు ● ఇకపై సంతకం చేసేది లేదంటూ బోర్డులు

● గెజిటెడ్‌ సంతకాలు చేసిన అధికారులపై కేసు ● కొంపముంచిన నకిలీ ధ్రువీకరణ పత్రాలు ● ఇకపై సంతకం చేసేది లేదంటూ బోర్డులు

మధిర: నకిలీ ధ్రువీకరణ పత్రాల వ్యవహారం ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త చిక్కులు తెచ్చిపెట్టింది. తప్పుడు ఆధారాలతో ఫ్యామిలీ మెంబర్‌ సర్టిఫికెట్‌ పొందేందుకు ఓ వ్యక్తి సమర్పించిన దరఖాస్తుపై కొందరు గెజిటెడ్‌ అధికారులు సంతకాలు చేశారు. దరఖాస్తుదారులపై నమ్మకం, పరిచయాలతో ప్రభుత్వ ఉద్యోగులు గెజిటెడ్‌ సంతకాలు చేయడం సాధారణమే అయినా ఇటీవల మధిర నుంచి జారీ అయిన సర్టిఫికెట్‌ కోసం సమర్పించిన పత్రాలు నకిలీవని తేలడంతో సంతకాలు చేసిన అధికారులపైనా కేసు నమోదు కావడం గమనార్హం.

మాకొద్దు ఈ తిప్పలు

పలువురు అధికారులపై కేసు నమోదు కావడంతో భవిష్యత్‌లో ఇలాంటి సమస్య రాకుండా పలువురు ధ్రువీకరణ పత్రాలపై సంతకాలు చేసేందుకు వెనుకాడుతున్నారు. కొందరు ఓ అడుగు ముందుకేసి తమ నివాసాలు, కార్యాలయాల వద్ద ‘ఇక్కడ గెజిటెడ్‌ సంతకాలు చేయబడవు’ బోర్డులు ఏర్పాటు చేయడం వారి ఆందోళనను తెలియజేస్తోంది. ఫలి తంగా వివిధ ధ్రువీకరణ పత్రాల కోసం గెజిటెడ్‌ అధికారుల సంతకాలు అవసరమయ్యే నిరుద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికై న అభ్యర్థులే కాక ఇంకొందరు ఇబ్బంది పడే అవకాశముంది.

నమ్మకంతో సంతకం.. కేసుతో తలనొప్పి

మధిర మండలం జిలుగుమాడు గ్రామానికి చెందిన నల్లగట్ల సీతారామయ్య మృతి చెందగా ఆయన కుటుంబానికి చెందిన సాయిప్రణీత్‌ తప్పుడు ఆధారాలు, ఫోర్జరీ సంతకాలతో ఫ్యామిలీ మెంబర్‌ సర్టిఫికెట్‌ కోసం దరఖాస్తు చేశాడు. తెలిసిన వ్యక్తే కదా అని ఇద్దరు గెజిటెడ్‌ అధికారులు దరఖాస్తుపై సంతకాలు చేశారు. అలాగే, సాయిప్రణీత్‌ బంధువు రికమండేషన్‌తో మరో ఇద్దరు కూడా సంతకం పెట్టారు. ఆతర్వాత రెవెన్యూ అధికారులు ఫ్యామిలీ మెంబర్‌ సర్టిఫికెట్‌ జారీ చేశారు. అనంతరం ఇందులో అవకతవకలు జరిగాయని తేలడంతో సర్టిఫికెట్‌ను రద్దు చేశారు. అయితే, తప్పుడు ఆధారాలతో ఫ్యామిలీ మెంబర్‌ తీసుకున్న సాయిప్రణీత్‌, ఆయన తల్లితో పాటు సంతకాలు చేసిన నలుగురు అధికారులు, అఫిడవిట్‌ ఇచ్చిన న్యాయవాదిపైనా సీతారామయ్య కుమారుడు ఎన్‌వీఎస్‌.ప్రసాద్‌ మధిర టౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. అధికారులు ఏదో ఆశించి సంతకాలు చేయలేదని, రాజీకి రావాలని ప్రభుత్వ ఉద్యోగే అయినా ఎన్‌వీఎస్‌.ప్రసాద్‌కు పలువురు నచ్చచెప్పినా ససేమిరా అన్నాడు. దీంతో కేసు నమోదు కాగా ప్రస్తుతం విచారణలో ఉంది. ఈ నేపథ్యాన ఇకపై సంతకాలు చేయొద్దని నిర్ణయించుకున్న పలువురు అధికారులు కార్యాలయాల వద్ద నోటీసులు ఏర్పాటుచేశారు. నకిలీ పత్రాలు సమర్పించిన వారిపై చర్యలు తీసుకుంటూనే, నిజమైన అవసరాలతో వచ్చే వారికి ఇబ్బంది రాకుండా సంబంధిత శాఖలు స్పష్టమైన మార్గదర్శకాలు రూపొందించాలనే డిమాండ్‌ వస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement