● కోటమైసమ్మ తల్లిని దర్శించుకున్న
భక్తజనం
కారేపల్లి: మండలంలోని ఉసిరికాయలపల్లిలో దసరా పండుగ సందర్భంగా మొదలైన కోటమైసమ్మ తల్లి జాతర గురువారం మూడో రోజుకు చేరింది. ఈ సందర్భంగా పెద్దసంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించారు. ఈనెల 26వ తేదీ వరకు జరిగే జాతరకు దేవాదాయ ధర్మదాయ శాఖ, పర్సా ట్రస్టు ఆధ్వర్యాన విస్తృత ఏర్పాట్లు చేశారు. జాతర ఆవరణలో సర్కస్‌లు, పిల్లలు, పెద్దలను అలరించేలా జాయింట్ వీల్, కొలంబో, టవర్ రైడర్ వంటివి ఏర్పాటుచేయడంతో రాత్రీపగలు సందడిగా ఉంటోంది. ఖమ్మం రూరల్ ఏసీపీ తిరుపతిరెడ్డి పర్యవేక్షణలో సింగరేణి సీఐ సాగర్, ఎస్ఐ గోపితో పాటు సిబ్బంది బందోబస్తు విధులు నిర్వర్తిస్తున్నారు. దేవాదాయ శాఖ ఈఓ కె.వెంకటయ్య, పర్సా ట్రస్టు చైర్మన్ పట్టాభిరామారావు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.
31 నుంచి రాష్ట్ర స్థాయి హ్యాండ్‌బాల్ టోర్నీ
ఖమ్మం స్పోర్ట్స్ : హ్యాండ్‌బాల్ అసోసియేషన్ ఆధ్వర్యాన జూనియర్స్ విభాగంలో రాష్ట్రస్థాయి బాలికల హ్యాండ్‌బాల్ టోర్నీ ఈనెల 31నుంచి నవంబర్ 2వ తేదీ వరకు నిర్వహించనున్నారు. ఈమేరకు పోటీల బ్రోచర్లను ఖమ్మంలోని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు క్యాంపు కార్యాలయంలో గురువారం కాంగ్రెస్ నాయకుడు తుమ్మల యుగంధర్ ఆవిష్కరించారు. నిర్వాహకులు మాట్లాడుతూ ఖమ్మంలోని సర్దార్ పటేల్ స్టేడియంలో పోటీలు జరగనుండగా, జిల్లా స్పోర్ట్స్ అథారిటీ, ఒలింపిక్ అసోసియేషన్ సహకారం అందిస్తున్నాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ మాజీ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఖాదర్ బాబా, హ్యాండ్‌బాల్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి వరికూటి మోహన్‌తో పాటు హన్మంతరావు, కృష్ణమోహన్ తదితరులు పాల్గొన్నారు.


