● పార్టీ మారాలంటూ ప్రతిపక్ష సర్పంచ్‌లపై ఒత్తిడి ● ధర్నాలో బీఆర్‌ఎస్, వామపక్ష పార్టీల నేతల ధ్వజం
ఖమ్మంమయూరిసెంటర్: ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపును ఆసరాగా చేసుకుని అధికార పార్టీ నేతలు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని.. ప్రతిపక్ష పార్టీల సర్పంచ్‌లకు డబ్బు చెల్లిస్తామని బేరసారాలకు దిగుతున్నారని విపక్ష నేతలు ఆరోపించారు. అంతేకాక గ్రామానికి రోడ్లు ఇస్తామని, భారీగా నిధులు కేటాయిస్తామంటూ కాంగ్రెస్‌లో చేరేలా ప్రలోభపెడుతున్నారని మండిపడ్డారు. ఇందిరమ్మ కమిటీల పేరుతో ప్రభుత్వం వివక్షపూరిత విధానాలను అవలంభిస్తోందని ఆరోపిస్తూ బీఆర్‌ఎస్, సీపీఎం, సీపీఐ, మాస్‌లైన్, న్యూడెమోక్రసీ, న్యూడెమోక్రసీ(చంద్రన్న వర్గం) ఆధ్వర్యాన కలెక్టరేట్ వద్ద గురువారం ధర్నా చేపట్టారు. ధర్నాచౌక్‌లో నిరసన తెలిపాక నేతలు, కార్యకర్తలు కలెక్టరేట్ గేటు ఎదుట ఆందోళనకు దిగారు. ఈక్రమాన పలువురు కలెక్టరేట్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట చోటు చేసుకుంది. అనంతరం పలువురిని అనుమతించడంతో కలెక్టర్ దివాకరకు వినతిపత్రం అందజేశారు.
పార్టీలో చేరితేనే పథకాలంటూ ఆఫర్లు..
కాంగ్రెస్‌లో చేరితే ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని, పనులు కేటాయిస్తామని సర్పంచ్‌లను ప్రలోభ పెడుతున్నారని ఎమ్మెల్సీ తాత మధుసూదన్, మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, సీపీఐ జాతీయ సమితి సభ్యుడు బాగం హేమంతరావు, సీపీఎం, మాస్‌లైన్, ఎన్‌డీ జిల్లా కార్యదర్శులు నున్నా నాగేశ్వరరావు, సీ.వై.పుల్లయ్య, బండారు ఐలయ్య మండిపడ్డారు. ఓ గ్రామానికి చెందిన మహిళా సర్పంచ్‌కు రూ.20 లక్షలు ఇస్తామని, పనులు కేటాయిస్తామని చెప్పినా ఆమె జనాల నమ్మకాన్ని వమ్ము చేసేది లేదంటూ తిరస్కరించిందని తెలిపారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రాతినిధ్యం వహిస్తున్న మధిర నియోజకవర్గం బోనకల్‌లో రేకుల షెడ్లు, పూరిపాకల్లో నివసిస్తున్న పేదలు బీఆర్‌ఎస్, వామపక్షాల మద్దతుదారులనే కారణంతో ఇళ్లు కేటాయించలేదని ఆరోపించారు. అధికారులకు ఫిర్యాదు చేస్తే కాంగ్రెస్ నాయకులు ఇచ్చిన జాబితాలే ఖరారు చేయాలని తమపై ఒత్తిడి ఉందని చెబుతున్నారని పేర్కొన్నారు. ఇక కల్లూరు మండలం మర్లపాడులో దివ్యాంగురాలైన దళిత మహిళ అధికార పార్టీ కాదనే ఉద్దేశంతో ఇల్లు ఇవ్వకపోతే, అక్కడి బీఆర్‌ఎస్ నాయకులే చందాలు వేసి ఇల్లు కట్టించారని తెలిపారు. ఇందిరమ్మ కమిటీల పేరుతో చేపడుతున్న కుట్రలను ఇకనైనా ఆపకపోతే ఉద్యమాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. గ్రామాల వారీగా కోటా ఆధారంగా ఎల్–1 జాబితా నుంచి లాటరీ పద్ధతిలో లబ్ధిదారులను ఎంపిక చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు కందాల ఉపేందర్‌రెడ్డి, బానోత్ చంద్రావతి, జెడ్పీ మాజీ చైర్మన్ లింగాల కమల్‌రాజు, ఆయా పార్టీల నాయకులు దండి సురేష్, మౌలానా, బీ.జీ.క్లెమెంట్, పగడాల నాగరాజు, బొమ్మెర రామ్మూర్తి, బెల్లం వేణు, బండి రమేష్, మాదినేని రమేష్, యర్రా శ్రీనివాస్, జి.రామయ్య, ఆవుల అశోక్, ఆవుల వెంకటేశ్వర్లు, కోలా లక్ష్మీనారాయణ, యుగంధర్ తదితరులు పాల్గొన్నారు.


