స్పష్టమైన లక్ష్యాలే కీలకం | - | Sakshi
Sakshi News home page

స్పష్టమైన లక్ష్యాలే కీలకం

Oct 23 2026 12:21 AM | Updated on Oct 23 2026 12:21 AM

● విద్య, వైద్యం, నైపుణ్య శిక్షణ, పరిశ్రమల అభివృద్ధికి ప్రాధాన్యత ● అభివృద్ధి ప్రణాళికల సమీక్షలో కలెక్టర్‌ దివాకర

వెట్టిచాకిరి నిర్మూలన

అందరి బాధ్యత

● విద్య, వైద్యం, నైపుణ్య శిక్షణ, పరిశ్రమల అభివృద్ధికి ప్రాధాన్యత ● అభివృద్ధి ప్రణాళికల సమీక్షలో కలెక్టర్‌ దివాకర

ఖమ్మం సహకారనగర్‌: జిల్లా సమగ్రాభివృద్ధి కోసం అన్ని శాఖల అధికారులు స్పష్టమైన లక్ష్యాలతో పని చేయాలని కలెక్టర్‌ దివాకర టీ.ఎస్‌. ఆదేశించారు. కలెక్టరేట్‌లో గురువారం ఆయన అదనపు కలెక్టర్‌ డాక్టర్‌ పి.శ్రీజతో కలిసి శాఖల శారీగా ప్రణాళికలపై సమీక్షించి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ స్వల్ప, మధ్య, దీర్ఘకాలిక లక్ష్యాలను నిర్దేశించుకోవడమే కాక ప్రతీనెల లక్ష్యాల సాధనలో పురోగతిని సమీక్షిస్తూ, అవసరమైన మార్పులు చేయాలని తెలిపారు.

ఇవీ సూచనలు..

జిల్లాలో శిశు, మాతృ మరణాల రేటు తగ్గించేందుకు స్పష్టమైన కార్యాచరణ రూపొందించాలని కలెక్టర్‌ సూచించారు. గర్భిణుల నమోదు వంద శాతం పూర్తి చేయడంతో పాటు ఆరోగ్య పరిస్థితి, వ్యాక్సినేషన్‌ను నిరంతరం పర్యవేక్షించాలని, సిజేరియన్‌ ప్రసవాల తగ్గింపుపై దృష్టి పెట్టాలని తెలిపారు. అటవీ ప్రాంతాలు, మారుమూల గ్రామాల పిల్లల్లో పోషకాహార లోపానికి కారణాలను గుర్తించి సమస్యలు పరిష్కరించాలని పేర్కొన్నారు. ప్రతీ పాఠశాల రేటింగ్‌ను పరిగణనలోకి తీసుకుని విద్యా ప్రమాణాలను మెరుగుపడేలా చూడడంతో పాటు విద్యార్థుల సంఖ్య పెంపు, భోజనం నాణ్యత మెరుగుపరచాలన్నారు. అన్ని వసతి విద్యాసంస్థల్లో తాగునీటి సదుపాయాల పరిస్థితిని పరిశీలించి నివేదిక ఇవ్వాలని తెలిపారు. యువతకు నైపుణ్య శిక్షణ అందించేందుకు సమగ్ర కార్యాచరణ రూపొందించాలని సూచించారు. అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీ సెంటర్లు, స్కిల్‌ యూనివర్సిటీ, వృత్తి విద్యా శిక్షణ కార్యక్రమాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని తెలిపారు. జిల్లాలో అందుబాటులో ఉన్న వనరులు, ఉత్పత్తులు, పారిశ్రామిక అవకాశాలను పరిగణనలోకి తీసుకుని పరిశ్రమల అభివృద్ధి ప్రణాళిక రూపొందించాలని సూచించారు. మిర్చి ఉత్పత్తి అధికంగా ఉన్నా అందుకు అనుగుణంగా ప్రాసెసింగ్‌ యూనిట్లు తక్కువగా ఉన్నందున ఆసక్తి ఉన్న వారి ప్రోత్సహించాలని తెలిపారు. ప్రభుత్వ కార్యాలయాల్లో హాజరు సహా పరిపాలనా ప్రక్రియలన్నీ ఆన్‌లైన్‌లో నిర్వహించాలని, శాఖల పనితీరు, లక్ష్యాల సాధన, సేవల పురోగతిని సమర్థవంతంగా పర్యవేక్షించేందుకు డ్యాష్‌బోర్డు అభివృద్ధి చేయాలన్నారు. పట్టణ ప్రాంతాల్లో మురుగునీటి శుద్ధి కేంద్రాల పనితీరు మెరుగుపరచడంతో పాటు తాగునీటి సరఫరా, ఫుట్‌పాత్‌లు, పారిశుద్ధ్య సదుపాయాలను మెరుగుపర్చాలని సూచించారు. జనాభా పెరుగుదల, పట్టణాలు, నగరాల విస్తరణ, కొత్త కాలనీల ఏర్పాటు, భవన నిర్మాణాల అవసరాలను ముందుగానే అంచనా వేసి అందుకు అనుగుణంగా ప్రణాళిక రూపొందించాలని కలెక్టర్‌ తెలిపారు. ఈ సమావేశంలో ఖమ్మం మున్సిపల్‌ కమిషనర్‌ అభిషేక్‌ అగస్త్య, సీపీఓ శ్రీనివాస్‌, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

ఖమ్మంమయూరిసెంటర్‌: సమాజంలో వెట్టిచాకిరి, బానిసత్వం వంటి దురాచారాలను పూర్తిస్థాయిలో నిర్మూలించేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా కృషి చేయాలని కలెక్టర్‌ దివాకర టీ.ఎస్‌. సూచించారు. వెట్టిచాకిరి నిర్మూలనపై కార్మిక శాఖ రూపొందించిన వాల్‌ పోస్టర్లను గురువారం కలెక్టరేట్‌లో ఆయన ఆవిష్కరించడమే కాక ప్రచార రథాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ సమాజంలో ప్రతీ ఒక్కరికీ గౌరవప్రదంగా జీవించే హక్కు ఉందని తెలిపారు. ఎవరితోనైనా బలవంతంగా పని చేయించడం, శ్రమకు తగిన ప్రతిఫలం ఇవ్వకపోవడం వంటి సమస్యలను అధికారుల గుర్తించి బాధితులకు అండగా నిలవాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో కార్మిక శాఖ డిప్యూటీ కమిషనర్‌ ఎం.కోటేశ్వరులు, సహాయ కమిషనర్‌ పి.కృష్ణవేణి, సహాయ కార్మిక అధికారి ఓ.రమేష్‌, వివిధ సంఘాల బాధ్యులు భాస్కర్‌, లక్ష్మయ్య, శ్రీనివాస్‌, వంశీ, రాధా, ప్రతాప్‌, వేణు, లత, సునీల్‌, బాబు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement