సెలవుల్లో చేస్తేనే..
రూ.కోట్లలో నిధులు..
మొదలుకాని పనులు
శిథిలావస్థకు చేరిన ఎస్సీ సంక్షేమ
వసతిగృహాల భవనాలు
అయినా పట్టింపులేనట్టుగా
అధికారుల తీరు
పూర్తి స్థాయిలో మరమ్మతులు
ఖమ్మంమయూరిసెంటర్: జిల్లాలోని ఎస్సీ సంక్షేమ శాఖ సంక్షేమ వసతిగృహాల భవనాల్లో సరైన నిర్వహణ లేక దెబ్బతింటున్నాయి. ఖమ్మంలోని ఎస్సీ డీడీ ఆనంద నిలయం బాలురు, జానకీపురం వసతిగృహాలు ప్రమాదకరంగా మారి ఎప్పుడేం జరుగుతుందో అన్నట్లుగా పరిస్థితులు నెలకొన్నాయి. అయినా మరమ్మతు చర్యలు చేపట్టడంలో సంబంధిత అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. కొన్నేళ్లుగా ఈ భవనాల మరమ్మతులకు అధికారులు ప్రతిపాదనలతోనే సరిపెడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
రూ.2.48 కోట్లకు పరిపాలన అనుమతి
వసతిగృహాల భవనాల మరమ్మతులు, పారిశుద్ధ్య పనులు, విద్యుదీకరణ, తాగునీటి వసతి తదితర పనుల కోసం ఈ ఏడాది మార్చిలో కలెక్టర్ నుంచి రూ.2.48 కోట్లకు పరిపాలనా అనుమతి లభించింది. గత ఏడాది చేసిన ప్రతిపాదనల మేరకు ఈ నిధులు కేటాయించారు. ఖమ్మం బాలుర వసతిగృహం(ఏ)కు రూ.37.50 లక్షలు, వైరా హాస్టల్‌కు రూ.24.25 లక్షలు, ఖమ్మం బాలుర హాస్టల్(సీ)కు రూ.17.25లక్షలు, రాజేశ్వరపురం హాస్టల్‌కు రూ.75 లక్షలు, జానకీపురం హాస్టల్‌కు రూ.67.50 లక్షలు, సత్తుపల్లి హాస్టల్‌కు రూ.11.75 లక్షలు, ఖమ్మం ఆనందనిలయం బాలుర హాస్టల్‌కు రూ.14.75 లక్షలు మంజూరు చేశారు.
అదనంగా మరో 1.17 కోట్లు
2026–27 ఆర్థిక సంవత్సరానికి గాను సంక్షేమ శాఖ కమిషనర్ హెడ్ ఆఫ్ అకౌంట్ 270/272 కింద ఈ ఏడాది జూలైలో జిల్లాకు మరో రూ.1,17,40,000 నిధులు మంజూరయ్యాయి. ఈ నిధులతో తక్షణమే పనులు ప్రారంభించాలని ఆదేశాలు వచ్చాయి. ఈ ఆదేశాలకు తోడు పలుమార్లు సూచనలు చేసినా ఇప్పటికీ పనులు ప్రారంభం కాకపోవడం గమనార్హం.
మళ్లీ ప్రతిపాదనలు
జిల్లాలో ఎస్సీ సంక్షేమ వసతిగృహ భవనాల మరమ్మతలకు కేటాయించిన నిధుల వినియోగంపై పట్టింపు కరువైందనే విమర్శలు వస్తున్నాయి. పూర్తి శిథిలావస్థకు చేరిన ఖమ్మం ఆనందనిలయం బాలు ర వసతిగృహం, జానకీపురం వసతిగృహాలకు కనీస నిధులు కేటాయించకుండా.. అన్ని వసతులు ఉన్న వసతిగృహానికి నిధులు కేటాయించడం గమనార్హం. ఇటీవల కురిసిన వర్షాలకు ఆనందనిలయం వసతిగృహ భవనం కురవడంతో అధికారులు పరిశీ లించారు. స్లాబ్ కుంగడంతో పూర్తి స్థాయి మరమ్మతులు అవసరమని ఇంజనీరింగ్ అధికారులు ప్రతి పాదించారు. ఈనేపథ్యాన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశాలతో మరమ్మతులకు మరోసారి ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు.
వేసవి సెలవుల్లో వసతిగృహాల మరమ్మతులు చేయాలని ప్రతిపాదిస్తున్న అధికారులు కార్యాచరణలో మాత్రం నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఇటీవల కురిసిన వర్షాలతో భవనాలు ప్రమాదకరంగా మారాయి. అలాగే, వర్షాలు తగ్గాక కొన్ని వసతిగృహాల్లో భవన పెచ్చులు ఊడి పడుతున్నాయి. ఈమేరకు మరో పది రోజుల్లో దసరా సెలవులు మొదలుకానున్నాయి. ఈ సెలవుల్లోనైనా అత్యవసర పనులు చేయిస్తే విద్యార్థులకు మేలు జరుగుతుందని పలువురు సూచిస్తున్నారు.
ఆనంద నిలయం భవనాన్ని పూర్తి స్థాయిలో మరమ్మతులకు చేయించేందుకు మరోసారి ప్రతిపాదనలు సిద్ధమవుతున్నాయి. త్వరలోనే ఈ పనులను మొదలవుతాయి. జిల్లాలో ఇతర వసతిగృహాల్లో కూడా అవసరమైన మరమ్మతులు చేసేందుకు టెండర్ ప్రక్రియ కొనసాగుతోంది.
– జి.జ్యోతి, ఎస్సీ కార్పొరేషన్ డీడీ


