మాకు యూరియా ఇవ్వరా? | - | Sakshi
Sakshi News home page

మాకు యూరియా ఇవ్వరా?

Oct 1 2026 12:47 AM | Updated on Oct 1 2026 12:47 AM

యాప్‌ ఓపెన్‌ కాదు.. బయట దొరకదు

మున్సిపాలిటీ పరిధి రైతులకు ఇక్కట్లు

సత్తుపల్లి: ఎరువుల అమ్మకానికి యాప్‌ ప్రవేశపెట్టగా.. రైతులు ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. సత్తుపల్లి మున్సిపాలిటీ పరిధిలోని సత్తుపల్లి, అయ్యగారిపేటతో పాటు ఏదులాపురం మున్సిపాలిటీ పరిధి రెవెన్యూ రెవెన్యూ గ్రామాల రైతులకు యాప్‌ ఓపెన్‌ కావడం లేదు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఫెర్టిలైజర్‌ ఫ్రేమ్‌ వర్క్‌ ఫర్‌ సేల్‌(ఎఫ్‌ ఎఫ్‌ఎస్‌) ద్వారా బుక్‌ చేసుకోవాల్సి ఉండగా, పలు మున్సిపాలిటీల పరిధి రైతుల భూములు మ్యాపింగ్‌ కాకపోవడంతో ఈ సమస్య తలెత్తుతోంది.

రెవెన్యూ పరిధి మార్చినా...

మున్సిపాలిటీ పరిధి భూములతో పాటు దేవాదా య శాఖ భూములను కౌలుకు సాగుచేసుకునే రైతులు యాప్‌ ద్వారా యూరియా బుక్‌ చేసుకోవడం కష్టంగా మారింది. ఈ భూములు మ్యాపింగ్‌ కాకపోవడంతో ఏర్పడిన సమస్యను జిల్లా వ్యవసాయ అధికారులు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లగా స్పెషల్‌ సత్తుపల్లి, స్పెషల్‌ అయ్యగారిపేట, స్పెషల్‌ ఏదులాపురం రెవెన్యూ పేరిట యాప్‌లో పొందుపరిచా రు. ఈక్రమాన సత్తుపల్లి, అయ్యగారిపేట రెవెన్యూ పరిధిలో 445 మంది యూరియా బుక్‌ చేసుకుంటే.. వ్యవసాయ అధికారి పోర్టల్‌లో చూపిస్తున్నా ఎరువులు ఎక్కడ తీసుకోవాలో స్పష్టత రాలేదు. అంతేకాక అదనంగా 600 మంది పైగా బుకింగ్‌ చేసుకున్నట్లు చూపిస్తోంది. ఇక సత్తుపల్లి సొసైటీకి 20 టన్నుల యూరియా మంగళవారం వచ్చినా సరఫరా చేసే పరిస్థితి లేక పక్కన పెట్టారు. సత్తుపల్లి మున్సిపాలిటీలోని రెండు రెవెన్యూ గ్రామాల్లో 1,549 ఎకరాలు సాగు చేస్తున్న 1,056 మంది రైతులు ఈ కారణంగా ఇబ్బంది పడుతున్నారు. పంటల కీలక దశలో యూరియా దొరకక, బయటకు అమ్మేవారు లేక సమీపంలోని ఆంధ్రాకు వెళ్లి అధిక ధరతో తీసుకొస్తున్నామని రైతులు వాపోతున్నారు.

దేవాదాయశాఖ భూముల్లో..

వేంసూరు మండలం కందుకూరు శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయానికి సంబంధించి భూములను పలువురు రైతులు కౌలుకు తీసుకున్నారు. ఆయా భూములు కూడా యాప్‌లో లేక రైతులకు యాప్‌ తెరుచుకోవడం లేదు. ఆలయం పేరిట కందుకూ రు, భరణిపాడు, దుద్దేపూడి, భీమవరం, సత్తుపల్లి మండలం తుంబూరులో 362 ఎకరాల భూమిని 29 మంది రైతులు కౌలుకు తీసుకున్నారు. వీరందరికీ యాప్‌లో బుక్‌ చేసుకోవడం వీలు కాక సాగు చేయలేని పరిస్థితి ఎదురవుతోంది. ఈ విషయమై సత్తుపల్లి ఏఓ యరపతినేని శ్రీనివాసరావును వివరణ కోరగా యాప్‌ సమస్యపై జిల్లా ఉన్నతాధికారులకు వివరించామని.. త్వరలో పరిష్కారమవుతుందని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement