ఖమ్మంమయూరిసెంటర్: ఖమ్మంలోని ఎస్‌ఆర్ అండ్ బీజీఎన్‌ఆర్ కళాశాల ప్రిన్సిపాల్ చాంబర్ ముందు ఏఐఎస్‌ఎఫ్, తదితర విద్యార్థి సంఘాల నాయకులు సోమవారం ఆందోళన చేపట్టారు. సెల్ఫ్ ఫైనాన్స్ పీజీ కోర్సుల్లో ప్రవేశానికి విద్యార్థుల నుంచి అదనంగా రూ.15 వేల చొప్పున వసూలు చేస్తున్నారని ఆరోపించారు. అదనపు మొత్తాన్ని చెల్లించాలని విద్యార్థులపై ఒత్తిడి చేయడం సరికాదని పేర్కొన్నారు. ఈ సందర్భంగా నాయకులతో ప్రిన్సిపాల్ చర్చించి చెల్లింపును తాత్కాలికంగా వాయిదా వేసి విద్యార్థుల అడ్మిషన్లు స్వీకరించేందుకు అంగీకరించారు. నాయకులు ఇటికాల రామకృష్ణ, బూర మనోజ్, శివనాయక్, మధు, రాజు, రమ్య, సరస్వతి, పావని తదితరులు పాల్గొన్నారు.


