సివిల్ రైట్స్ డే తప్పనిసరిగా నిర్వహించాలి
రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య
ఖమ్మంమయూరిసెంటర్: జనాభా దామాషా ప్రకారం ప్రభుత్వ ఫలాలు ఎస్సీ, ఎస్టీ వర్గాలకు అందేలా అధికారులు కృషి చేయాలని రాష్ట్ర షెడ్యూల్ కులాల, షెడ్యూల్ తెగల కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య సూచించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో కమిషన్ సభ్యులు కుస్రం నీలాదేవి, రాంబాబు నాయక్, కలెక్టర్ దివాకర టీ.ఎస్., పోలీస్ కమిషనర్ సునీల్‌దత్‌తో కలిసి సోమవారం ఆయన భూమి, సర్వీసెస్, అట్రాసిటీ కేసులపై అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా చైర్మన్ వెంకటయ్య మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ యువతకు స్వయం ఉపాధి, నైపుణ్యాభివృద్ధి అవకాశాలు కల్పించే రాజీవ్ యువ వికాసం కార్యక్రమాన్ని నవంబర్‌లో ప్రభుత్వం ప్రారంభించనుందని తెలిపారు. జిల్లాలో పెండింగ్ ఉన్న అంగన్‌వాడీ కేంద్రాల నిర్మాణ పనులను త్వరగా పూర్తిచేయాలని, ఎస్సీ, ఎస్టీ గురుకులాల్లో విద్యార్థులకు ఇబ్బంది రాకుండా వసతులు కల్పించాలని సూచించారు. అలాగే, ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ కింద కేటాయించిన నిధులను తప్పనిసరిగా ఆయా వర్గాల నివాస ప్రాంతాలు, తండాలు, కాలనీల అభివృద్ధికి మాత్రమే వినియోగించాలని స్పష్టం చేశారు. అట్రాసిటీ కేసుల విచారణ త్వరగా పూర్తి చేసి బాధితులకు పరిహారం, న్యాయం అందించాలని సూచించిన చైర్మన్... ప్రతీనెల చివరి వారంలో సివిల్ రైట్స్ డే తప్పక నిర్వహిస్తూ తహసీల్దార్లు, స్టేషన్ హౌజ్ అధికారి స్థాయి అధికారులు పాల్గొనాలని చైర్మన్ వెల్లడించారు.
బాధితులకు రూ.9.07 కోట్ల పరిహారం
కలెక్టర్ దివాకర మాట్లాడుతూ నిర్దేశిత కోటా ప్రకారం అర్హులైన ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులకు ఇళ్ల కేటాయింపులో న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. బోనకల్, రఘునాథపాలెంలో యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూళ్ల నిర్మాణం వచ్చే విద్యాసంవత్సరం నాటికి, మిగిలినవి వచ్చే ఏడాది డిసెంబర్ వరకు అందుబాటులోకి వస్తాయన్నారు. జిల్లాలో నమోదైన 797 కేసుల్లో 930 బాధితులకు రూ.12,42,50,000 పరిహారం మంజూరు కాగా, రూ.9.05 కోట్లు అందజేశామని చెప్పారు. సీపీ సునీల్‌దత్ మాట్లాడుతూ 2017 నుండి ఇప్పటి వరకు 878 ఎస్సీ, ఎస్టీ కేసులు నమోదైతే 653 కేసుల్లో చార్జీషీట్లు దాఖలు చేయగా, ఎనిమిది కేసుల్లో శిక్ష పడిందని తెలిపారు. ఇంకా ఈ సమీక్షలో అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డి, కల్లూరు సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్, ట్రెయినీకలెక్టర్ పారస్ కుమార్, కల్లూరు ఏసీపీ వసుంధరయాదవ్, ఎస్సీ, ఎస్టీ శాఖల డీడీలు జి.జ్యోతి, ఫిరంగి తదితరులు పాల్గొన్నారు.


