ఖమ్మం స్పోర్ట్స్: ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌లో భాగంగా ఆర్చరీ పోటీలు ఖమ్మంలోనే నిర్వహించాలని నిర్ణయించారు. ఈమేరకు ఖేలో ఇండియా ప్రతినిధులు సోమవారం సర్దార్ పటేల్ స్టేడియంను పరిశీలించారు. గతంలోనూ ఓసారి ఇక్కడ పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేసినా, ఆ తర్వాత ఖమ్మంకు వేదిక కేటాయించలేదు. దీంతో అధికారులు, ఆర్చరీ అసోసియేషన్ ప్రతినిధులు పట్టుబట్టి ఇక్కడి వసతులను ఖేలో ఇండియా బృందం దృష్టికి తీసుకెళ్లడంతో సుముఖత కనబరిచారు. అంతేకాక పోటీల నిర్వహణకు కావాల్సిన వసతుల పరిశీలనకు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, ఖేలో ఇండియా ఆర్చరీ పోటీల మేనేజర్ బ్రెజేష్‌కుమార్, తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీకి చెందిన క్రాంతి సోమవారం పర్యటించారు. ఆర్చరీ పోటీల నిర్వహనకు సర్దార్ పటేల్‌స్టేడియం అనువుగా ఉందని తేల్చారు. ఈకార్యక్రమంలో జాతీయ ఆర్చరీ అసోసియేషన్ కమిటీ సభ్యుడు పుట్టా శంకరయ్య, డీవైఎస్‌ఓ టి.సునీల్‌రెడ్డి, ఆర్చరీ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు సాధుల సారంగపాణి, అథ్లెటిక్స్, ఆర్చరీ కోచ్‌లు ఎం.డీ.గౌస్, మేనేజర్ ఉదయ్‌కుమార్ పాల్గొన్నారు.
డిసెంబర్‌లో పోటీలు
జిల్లా కేంద్రంలో ఈ ఏడాది డిసెంబర్‌లో ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌లో భాగంగా ఆర్చరీ పోటీలు జరగనున్నాయి. పోటీలకు దేశావ్యాప్తంగా 300 మందికి పైగా క్రీడాకారులు హాజరయ్యే అవకాశముంది. వీరితో పాటు కోచ్‌లు, మేనేజర్లు కలిపి 400 మందికిపైగా వసతి కల్పించనున్నారు. ఐదు రోజుల పాటు పోటీలు జరగనుండగా.. సర్దార్ పటేల్ స్టేడియంలో అదనపు హంగులు సమకూరే అవకాశముంది.
పట్టుబట్టి సాధించిన స్పోర్ట్స్ అథారిటీ, అసోసియేషన్


