ఖమ్మంవ్యవసాయం: వినాయక నిమజ్జనం రోజున నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేయడమే కాక ఎక్కడా సమస్యలు రాకుండా విద్యుత్ శాఖ అధికారులు ముందస్తు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. సురక్షితంగా, సజావుగా ఊరేగింపులు సాగేలా ఎస్‌ఈ ఇనుగుర్తి శ్రీనివాసాచారి సూచనలతో నిమజ్జన కేంద్రాలు, ప్రధాన ఊరేగింపు మార్గాలను ఉద్యోగులు పరిశీలించారు. ఊరేగింపు మార్గాల్లో విద్యుత్ తీగలు అడ్డు రాకుండా ముందుగానే సరిచేయనున్నారు. అంతేకాక నిమజ్జనం రోజున విద్యుత్ సరఫరా పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించేందుకు ఎస్‌ఈ కార్యాలయంలో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. బుధవారం ఉదయం 9 నుంచి గురువారం ఉదయం 7గంటల వరకు అధికారులు ఈ కంట్రోల్ రూమ్‌లో ఉంటారు. విద్యుత్ సరఫరాకు సంబంధించిన ఫిర్యాదులు, అత్యవసర సమాచారం కోసం కంట్రోల్ రూమ్ ఫోన్ నంబర్ 87124 83490 లేదా టోల్ ఫ్రీ నంబర్ 1912కు సమాచారం ఇవ్వాలని ఎస్‌ఈ సూచించారు. కాగా, నగరంలో ప్రతిష్ఠించిన భారీ విగ్రహాలను ఎస్‌ఈ సోమవారం పరిశీలించగా... వాటిని వాహనాల్లోకి ఎక్కించడం, శోభాయాత్ర మార్గంలో ఎక్కడైనా విద్యుత్ తీగలు అడ్డుగా వస్తాయా అని వివరాలు సేకరించారు. బ్రాహ్మణబజార్‌లోని శివాలయం సెంటర్‌లో ఏర్పాటు చేసిన 40 అడుగుల విగ్రహంతో మరికొన్ని ప్రాంతాల్లో విగ్రహాలను ఎస్‌ఈ శ్రీనివాసాచారి పరిశీలించారు.


