హెచ్‌పీవీ వ్యాక్సిన్‌.. 89శాతం | - | Sakshi
Sakshi News home page

హెచ్‌పీవీ వ్యాక్సిన్‌.. 89శాతం

Aug 24 2026 12:13 AM | Updated on Aug 24 2026 12:13 AM

● 9,609 మంది బాలికలకు టీకా ● వచ్చే నెల 8తో ముగియనున్న గడువు

ఖరీదైన వ్యాక్సిన్‌ ఉచితంగా

● 9,609 మంది బాలికలకు టీకా ● వచ్చే నెల 8తో ముగియనున్న గడువు

ఖమ్మం వైద్యవిభాగం: జిల్లాలో హెచ్‌పీవీ(హ్యూమన్‌ పాపిల్లోమా వైరస్‌) వ్యాక్సినేషన్‌ తుది దశకు చేరింది. గర్భాశయ ముఖద్వార కేన్సర్‌ నివారణ కోసం ప్రభుత్వం హెచ్‌పీవీ వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తీసుకురాగా, ఈ ఏడాది మార్చి 8వ తేదీ నుంచి ప్రారంభించారు. 14 ఏళ్లు పూర్తయి 15వ ఏట అడుగుపెట్టిన బాలికలకు ఈ టీకా వేస్తున్నారు. తొలుత మూడు నెలల పాటే వ్యాక్సినేషన్‌ ఉంటుందని ప్రకటించినా, లక్ష్యాన్ని చేరకపోవడంతో ప్రభుత్వం మరో మూడు నెలలు పొడిగించింది. ఈ గడువు సెప్టెంబర్‌ 8వ తేదీతో ముగియనుంది. జిల్లాలో 10,833 మంది అర్హులైన బాలికలను గుర్తించిగా, శనివారం(22వ తేదీ) వరకు 9,609 మందికి వ్యాక్సిన్‌ వేయడంతో 89 శాతం పూర్తయింది.

మరో 1,224 మంది

హెచ్‌పీవీ వ్యాక్సినేషన్‌ను ఈ ఏడాది మార్చిలో ప్రారంభించినా తొలినాళ్లలో చాలామంది ముందుకు రాలేదు. వివిధ రకాల అపోహలతో బాలికల తల్లిదండ్రులు సంకోచించారు. ఆ తర్వాత జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ సిబ్బంది క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించడంతో వేగం పుంజుకుంది. ఈక్రమంలోనే ప్రభుత్వం తొలుత ప్రకటించిన మూడు నెలల కార్యక్రమాన్ని మరో మూడు నెలలు పొడిగించింది. జిల్లాలో 89 శాతం వ్యాక్సినేషన్‌ పూర్తి కాగా, మరో 1,224 మంది బాలికలకు వ్యాక్సిన్‌ వేస్తే నూరు శాతం లక్ష్యాన్ని చేరినట్లవుతుంది.

12 సెంటర్ల పరిధిలో పూర్తి

జిల్లా జనరల్‌ ఆస్పత్రితో పాటు మొత్తం 30 సెంటర్లలో హెచ్‌పీవీ వ్యాక్సిన్‌ వేస్తున్నారు. ప్రభుత్వ సెలవులు మినహా ప్రతీరోజు ఉదయం 9నుంచి మద్యాహ్నం 2గంటల వరకు టీకా వేస్తారు. జిల్లాలోని 30సెంటర్లకు గాను, తిరుమలాయపాలెం, సింగరేణి, పెద్దగోపతి, గంగారం, కామేపల్లి, మాటూరుపేట, కొణిజర్ల, తల్లాడ, వైరా, దెందుకూరు పీహెచ్‌సీలు, మధిర పీపీ యూనిట్‌, ముస్తఫానగర్‌ యూపీహెచ్‌సీల పరిధిలో నూరు శాతం వ్యాక్సినేషన్‌ పూర్తి చేశారు. మిగతా సెంటర్లలో గడువులోగా వ్యాక్సినేషన్‌ పూర్తి చేసేలా అధికారులు చర్యలు చేపట్టారు.

ప్రభుత్వ ఆస్పత్రుల్లో అందించే హెచ్‌పీవీ వ్యాక్సిన్‌ చాలా ఖరీదైందని అధికారులు చెబుతున్నారు. ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో ఈ టీకా ఖరీదు రూ.20వేలకు ఉంటుందని తెలుస్తోంది. బాలికల తల్లిదండ్రులు ఎలాంటి అపోహలు గురికాకుండా నూరు శాతం సురక్షితమైన టీకా వేయించాలని అధికారులు సూచిస్తున్నారు. 14 ఏళ్లు నిండి 15వ ఏటలో ఉన్న బాలికలకు హర్మోన్ల మార్పుల కారణంగా ఇన్‌ఫెక్షన్లు సోకి, గర్భాశయ ముఖద్వార కేన్సర్‌కు దారితీస్తాయని వైద్యులు చెబుతున్నారు. ఈనేపథ్యాన హ్యూమనో పాపిల్లోమా వైరస్‌ను అరికట్టేందుకు బాలికలకు హెచ్‌పీవీ టీకాను వేయించాలని సూచిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement