దోతిగూడెం పేలుడు మృతుల్లో జిల్లా వాసి
ఇటీవలే ఇంటి నిర్మాణం, త్వరలో పెళ్లికి ఏర్పాట్లు
వేంసూరు: కూలీ పనులతో జీవనం సాగిస్తున్న ఆ దంపతులకు కుమారుడు అండగా నిలుస్తున్నాడు. త్వరలోనే కుమారుడి పెళ్లి చేయాలని నిర్ణయించుకుని, ఇల్లు సరిగ్గా ఉండాలనే భావనతో అప్పు చేసి మరీ ఇంటిని నిర్మించారు. కానీ ఉపాధి బాటలో వెళ్లిన ఆ యువకుడు కన్నుమూయడం ఆ కుటుంబంలో విషాదాన్ని నింపింది. యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం దోతిగూడెంలోని హెజెలో ల్యాబ్స్ ఫార్మా కంపెనీలో శుక్రవారం అర్ధరాత్రి ప్రైవేట్ కంపెనీలో జరిగిన రియాక్టర్ పేలుడులో వేంసూరు మండలం చౌడవరానికి చెందిన నాగనబోయిన నరేష్‌కుమార్(29) మృతి చెందాడు. చౌడవరానికి చెందిన నాగనబోయిన వెంకటరాజు దంపతులకు ఓ కుమార్తె, కుమారుడు నరేష్ ఉన్నారు. కుమార్తె వివాహం ఇప్పటికే జరగగా, రోజువారి కూలీ పనులతో జీవనం సాగిస్తూ కుమారుడిని డిగ్రీ వరకు చదివించారు. నాలుగేళ్ల క్రితం నరేష్ దోతిగూడెంలోని ఫ్యాక్టరీలో కెమిస్ట్‌గా ఉద్యోగంలో చేరాడు.
అప్పు చేసి ఇంటి నిర్మాణం
రోజువారీ కూలీలైన తమకు అండగా నిలుస్తున్న నరేష్ పెళ్లి చేయాలని తల్లిదండ్రులు భావించారు. ఇల్లు సరిగ్గా ఉండాలనే భావనతో అప్పు చేసి ఇటీవల ఇంటిని నిర్మించారు. పెళ్లి సంబంధాలు చూస్తుండగానే.. ఫ్యాక్టరీలో పేలుడు జరిగిందనే సమాచారం అందింది. దీంతో తమ కుమారుడికి ఏమీ కావొద్దని వెంకటరాజు దంపతులు మొక్కుతుండగానే ఆయన మృతి చెందినట్లు తెలిసింది. ‘రెండు నెలల క్రితం ఇంటికి వచ్చిన కొడుకు.. మూడు రోజుల క్రితం ఫోన్ చేసినప్పుడు రెండు రోజుల్లో వస్తానని చెప్పాడు... ఇప్పుడే ఇలా అయిందా’ అంటూ వారు రోదించిన తీరు గ్రామస్తులను కంటతడి పెట్టించింది. కాగా, ఇదే ఫ్యాక్టరీలో పనిచేస్తున్న వెంకటాపురానికి చెందిన వెదుళ్ల చెన్నకేశవులు గాయపడ్డాడు.
రెండు మిల్లుల్లో రూ.10కోట్ల ధాన్యం పక్కదారి!
ఖమ్మం సహకారనగర్: జిల్లాలోని రైస్‌మిల్లుల్లో విజిలెన్స్ అధికారుల తనిఖీలు ముమ్మరంగా సాగుతున్నాయి. తాజాగా శనివారం రెండు మిల్లుల్లో విజిలెన్స్ బృందాలు తనిఖీ చేయగా సుమారు రూ.10కోట్ల మేర ధాన్యం తక్కువగా ఉన్నట్లు గుర్తించారు. కొణిజర్లలోని శ్రీనివాస రైస్ మిల్లులో 1,709 మెట్రిక్ టన్నులు, కూసుమంచి మండలం మల్లేపల్లిలోని దక్షిణమూర్తి రైస్ మిల్లుల్లో 3,379 మెట్రిక్ టన్నుల ధాన్యం తేడా ఉన్నట్లు గుర్తించామని డీసీఎస్‌ఓ చందన్‌కుమార్ తెలిపారు. ఈ ధాన్యం విలువ సుమారు రూ.10కోట్లు ఉంటుందని సమాచారం.
హామీల అమలులో పాలకుల విఫలం
ఖమ్మంమయూరిసెంటర్: రాష్ట్రప్రభుత్వ పెద్దలు హామీలను విస్మరించి, అంతర్గత కొట్లాటలతో కాలం వెళ్లదీస్తున్నారే తప్ప నిరుద్యోగ యువత సమస్యలను పట్టించుకోవడం లేదని ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ వలీ ఉల్లా ఖాద్రీ విమర్శించారు. ఖమ్మంలోని సీపీఐ కార్యాలయంలో శనివారం ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలపై ఏఐవైఎఫ్ ఆధ్వర్యాన పోరాటాలు ఉధృతం చేస్తామని తెలిపారు. కాగా, కొదుమూరులో శుక్రవారం నిర్వహించిన ఏఐవైఎఫ్ జిల్లా మహాసభల్లో 17 తీర్మానాలు ఆమోదించడంతో పాటు నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు కె.గోవిందరావు వెల్లడించారు. అధ్యక్ష, కార్యదర్శులుగా మామిళ్ల శ్రీనాథ్‌రెడ్డి, చింతల రమేష్, ఆర్గనైజింగ్ కార్యదర్శిగా మద్దోజు శ్రావణ్, వర్కింగ్ ప్రెసిడెంట్‌గా అబ్బూరి మహేష్‌తో పాటుగా 21మంది ఆఫీస్ బేరర్లు, 69మందితో కౌన్సిల్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నామని తెలిపారు.


