ఖమ్మం లీగల్: బాలబాలికలకు భద్రమైన బాల్యాన్ని అందించడాన్ని అందరూ బాధ్యతగా భావించాలని జిల్లా న్యాయసేవా సంస్థ చైర్మన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి నాగరాజు తెలిపారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సమావేశ మందిరంలో శనివారం నిర్వహించిన అవగాహన సదస్సును కలెక్టర్ దివాకర టీ.ఎస్.తో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా జడ్జి నాగరాజు మాట్లాడుతూ ఉపాధ్యాయులు కూడా పిల్లలను ప్రేమ, బాధ్యతతో సంరక్షించాలని సూచించారు. చిన్ననాటి నుంచే చట్టాలు, ప్రాథమిక హక్కులపై అవగాహన కల్పించడమే కాక అనవసరపు స్పర్శను తెలియజేసేలా ధైర్యాన్ని నింపాలని తెలిపారు. ఇక బాలల సంరక్షణ అధికారులు ఉద్యోగాన్ని సామాజిక బాధ్యతగా భావిస్తూ బాల్య వివాహాలు, బాలకార్మిక వ్యవస్థ, పిల్లలపై జరుగుతున్న వేధింపులను అరికట్టడానికి కృషి చేయాలని తెలిపారు. అనంతరం కలెక్టర్ దివాకర మాట్లాడుతూ బాలలు ఎదుర్కొంటున్న సమస్యలు కొత్త రూపు దాలుస్తున్నందున అధికారులు సమర్థవంతంగా విధులు నిర్వర్తించాలని సూచించారు. న్యాయమూర్తులు డాక్టర్ పీ.పీ.కృష్ణఅర్జున్, డాక్టర్ జీ.వీ.మహేష్‌నాధ్, వి.శ్రీనయ్య, ఎం.శ్రీనివాస్, ఎం.కల్పన, శివరంజని, టి.మురళీమోహన్, పి.దేవీమానస, మీరా ఖాసీం సాహెబ్, కె.జ్యోతిర్మయి, బి.రజని, వై.బిందుప్రియ, ఏ.ప్రవీణ్, బి.నాగలక్ష్మి, జి.అఖిలగౌడ్, వి.దీప్తి, జి.నిష్క, బి.నాగసుమబాల, వి.లావణ్య, బాల సంరక్షణ అధికారి విష్ణువందన తదితరులు పాల్గొన్నారు.
జిల్లా ప్రధాన న్యాయమూర్తి నాగరాజు


