మిల్లర్లలో దడ.. దడ | - | Sakshi
Sakshi News home page

మిల్లర్లలో దడ.. దడ

Aug 22 2026 12:18 AM | Updated on Aug 22 2026 12:18 AM

ధాన్యంలో తేడాలు గుర్తించాం..

తనిఖీలకు దిగిన విజిలెన్స్‌,

ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బృందాలు

ఇప్పటివరకు 1.47 లక్షల మె.టన్నుల తేడా గుర్తింపు

మిల్లర్లకు నోటీసులు..

రూ.50 కోట్ల జరిమానా

ఎవరేం చేయలేరని...

సాక్షి ప్రతినిధి, ఖమ్మం: జిల్లాలో వరుసగా జరుగుతున్న విజిలెన్స్‌, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ తనిఖీలతో రైస్‌ మిల్లర్లలో అలజడి మొదలైంది. కొన్నేళ్లుగా కస్టమ్‌ మిల్లింగ్‌ రైస్‌(సీఎంఆర్‌) ఇవ్వకుండా ఎగ్గొడుతున్న మిల్లులను గుర్తించి దాడులు చేస్తున్నారు. మునుపె న్నడూ లేని విధంగా తనిఖీలకు దిగడంతో మిల్లుల యాజమాన్యాలకు వణుకు పుడుతోంది. ఏళ్లుగా కొందరు మిల్లర్లు సీఎంఆర్‌ చెల్లింపులో అలసత్వం వహించడమే కాక ధాన్యం, బియ్యాన్ని పక్కదారి పట్టిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వం గడువు పెంచుతున్నా ఫలితం లేక సీఎంఆర్‌ అత్యధికంగా పెండింగ్‌ ఉన్న మిల్లులపై విజిలెన్స్‌, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ తనిఖీలకు ఆదేశించారు. ఇప్పటివరకు జిల్లాలో 12 మిల్లుల్లో తనిఖీ చేయగా, 2025–26 వానాకాలం, యాసంగికి సంబంధించి 1,47,453.154 మె.టన్నుల ధాన్యం తేడా గుర్తించారు. ఆయా మిల్లుల యజమానులకు నోటీసులు జారీ చేయడంతోపాటు రూ.50 కోట్ల జరిమానా విధించారు. ఇందులో మిల్లర్లు రూ.21 కోట్లు చెల్లించగా.. మిగిలిన సొమ్ము రెండు, మూడు రోజుల్లో చెల్లిస్తే కేసుల నుంచి మినహాయింపు ఇవ్వనున్నట్లు తెలిసింది.

ఏళ్ల తరబడి నిర్లక్ష్యమే..

సీఎంఆర్‌ వ్యవహారంలో కొన్నేళ్లుగా మార్పు రావడం లేదు. 2025–26 వానాకాలం, యాసంగి సీజన్‌కు సంబంధించిన సీఎంఆర్‌ చెల్లింపుల్లోనూ అదే ధోరణి కొనసాగుతోంది. ఎక్కువ మొత్తంలో సీఎంఆర్‌ చెల్లించాల్సిన మిల్లులను డీఫాల్ట్‌గా ప్రకటించి ఆ తర్వాత సీజన్‌లో ధాన్యం ఇవ్వడం లేదు. అయినా మిల్లర్లు పైరవీ చేసుకుని మళ్లీ ధాన్యం తీసుకోవడం.. ఆపై సీఎంఆర్‌ ఎగ్గొడుతూ ధాన్యాన్ని పక్కదారి పట్టించడం సాధారణమైపోయింది. ఫలితంగా పౌర సరఫరాల సంస్థకు లక్ష్యం మేర సీఎంఆర్‌ రాకపోవడంతో ప్రభుత్వ విద్యాసంస్థల్లో మధ్యాహ్న భోజనం, రేషన్‌షాపుల ద్వారా పంపిణీకి ఆచితూచి వ్యవహరించాల్సి వస్తోంది. ఒక్కోసారి ఇక్కడ బియ్యం కొరత ఏర్పడి ఇతర జిల్లాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి పరిస్థితి ఎదురవుతోంది.

జిల్లాలోని 12 మిల్లుల్లో తనిఖీలు పూర్తయ్యాయి. ఆయా మిల్లుల్లో చెల్లించాల్సిన సీఎంఆర్‌ కన్నా తక్కువ ధాన్యం నిల్వలు ఉన్నట్లు తేలింది. దీంతో సంబంధిత మిల్లు యజమానులకు నోటీసులు జారీ చేయడమేకాక రూ.50 కోట్ల జరిమానా విధించాం. ఇందులో రూ.21 కోట్లు చెల్లించారు. మిగిలిన మొత్తాన్ని ప్రభుత్వ ఆదేశాల ప్రకారం రెండు, మూడు రోజుల్లో చెల్లించకపోతే తదుపరి చర్యలు ఉంటాయి. – చందన్‌కుమార్‌,

జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి

సీఎంఆర్‌ చెల్లింపుల్లో ఇన్నాళ్లు అలసత్వం

జిల్లాలో సీఎంఆర్‌ చెల్లించని మిల్లుల్లో గత 15 రోజులుగా విజిలెన్స్‌, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ దాడులు కొనసాగుతున్నాయి. మిల్లుల్లో ధాన్యం నిల్వ లను పరిశీలించడమే కాక రికార్డుల ఆధారంగా సీఎంఆర్‌ వివరాలు తెలుసుకుంటున్నారు. అయితే చాలా మిల్లుల్లో సీఎంఆర్‌ చెల్లించాల్సిన ధాన్యం కంటే తక్కువగా ఉండడంతో పక్కదారి పట్టించినట్లు తేల్చి చర్యలకు ఉపక్రమించారు. ఇప్పటికే 12 మిల్లుల్లో తనిఖీలు పూర్తి కాగా.. 1,47,453.154 మె.టన్నుల ధాన్యం తక్కువ ఉందని తేల్చారు. ఆయా మిల్లర్లకు నోటీసులు ఇవ్వడమే కాక మిగతా మిల్లుల్లోనూ తనిఖీలకు సిద్ధమవుతున్నారు. కాగా, ఎవరూ ఏమీ చేయలేరని, తనిఖీలు ఉండవనే ఉద్దేశంతో ధాన్యం పక్కదారి పట్టించిన మిల్లర్లలో ఇప్పుడు వణుకు పుడుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement