ఖమ్మంవ్యవసాయం: ఎల్‌నినో పరిస్థితులతో వరి సాగు తగ్గించాలని ప్రభుత్వం సూచిస్తోంది. అయినప్పటికీ నీటి వనరులు ఉన్న ప్రాంతాల్లో రైతులు సాగుకు మొగ్గు చూపుతున్నారు. ఇందులో అత్యధి కం సన్న రకాలే ఉండగా, గతంలో మాదిరి అన్నింటికీ కాక రూ.500 బోనస్ కొన్ని రకాలకే ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. నిర్దేశించిన ఏడు రకాలు సాగు చేసే రైతులు కూడా ఆన్‌లైన్‌లో నమోదు చేసుకుంటేనే బోనస్ అందనుంది. డీలర్లు, వ్యవసాయ విస్తర్ణాధికారుల వద్ద ఆన్‌లైన్ చేయించుకునేందుకు వచ్చేనెల 10వ తేదీ వరకు గడువు విధించారు.
డీలర్లు, ఏఈఓల వద్ద..
నిర్దేశిత రకాల విత్తనాలను కొనుగోలు చేసిన రైతులు పట్టాదారు పాస్ పుస్తకం, ఆధార్ కార్డు, రశీదుతో డీలర్‌ను కలిసి ఆన్‌లైన్‌లో నమోదు చేయించుకోవాలి. సొంతంగా విత్తనాలు సమకూర్చుకున్నవారే కాక ఇతర రైతులు, పరిశోధనా కేంద్రాల నుంచి, అనుమతి పొందిన ఇతర వనరుల నుంచి విత్తనాలు తెచ్చుకుంటే వ్యవసాయ విస్తరణ అధికారికి ధ్రువీకరణ పత్రం సమర్పించి నమోదు చేయించుకోవాలి. కాగా, ఎల్‌నినో కారణంగా నీటి వనరులు తగ్గడంతో వరి సాగు విస్తీర్ణం సగానికి పడిపోయింది. జిల్లాలో వరి సాధారణ సాగు విస్తీర్ణం 3లక్షల ఎకరాలు కాగా, ఇప్పటి వరకు కేవలం 1.60 లక్షల ఎకరాల్లో వరి సాగైంది. ఇవి కూడా సన్న రకాలేనని అధికారులు చెబుతున్నారు.
ఆన్‌లైన్ తప్పనిసరి..
వచ్చేనెల 10వరకు గడువు


