ఖమ్మం స్పోర్ట్స్: అథ్లెటిక్స్ జిల్లా జట్ల ఎంపికకు ఖమ్మంలోని ఎస్‌ఆర్ అండ్ బీజీఎన్‌ఆర్ డిగ్రీ కళాశాల మైదానంలో శుక్రవారం పోటీలు నిర్వహించారు. అండర్–14, 16, 18, 20 కేటగిరీల్లో నిర్వహించిన పోటీలకు విశేష స్పందన లభించింది. మొత్తం 234 మంది బాలబాలికలు హాజరుకాగా, ఇందులో 140మంది బాలురు, 94మంది బాలికలు ఉన్నారు. ఈమేరకు వివిధ పోటీలు నిర్వహించి జిల్లా జట్లను ఎంపిక చేశారు. ఆయా జట్లు ఈనెల 26, 27వ తేదీల్లో హనుమకొండలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటాయని అథ్లెటిక్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు మందుల వెంకటేశ్వర్లు, ఎం.డీ.షఫీక్ అహ్మద్ తెలిపారు. పోటీలను అథ్లెటిక్స్ కోచ్ ఎం.డీ.గౌస్‌తో పాటు సుధాకర్, కృష్ణయ్య, ఎస్.వెంకటేశ్వర్లు, రవికుమార్, ముజాహిద్, శ్రీదేవి, నరసింహ, వెంకటారావు పర్యవేక్షించారు.


