నాన్నకు చివరి ముద్దు.. | - | Sakshi
Sakshi News home page

నాన్నకు చివరి ముద్దు..

Aug 23 2026 12:16 AM | Updated on Aug 23 2026 12:16 AM

● బైక్‌పై వెళ్తుండగా ఢీకొట్టిన కారు ● తీవ్రగాయాలతో అక్కాచెల్లెళ్ల పిల్లలు మృతి

● బైక్‌పై వెళ్తుండగా ఢీకొట్టిన కారు ● తీవ్రగాయాలతో అక్కాచెల్లెళ్ల పిల్లలు మృతి

రఘునాథపాలెం: ‘డాడీ.. అన్నయ్య వచ్చాడు.. పెద్దమ్మ ఇంటికి వెళ్తున్నా’ అంటూ తండ్రికి ముద్దుపెట్టి బయలుదేరిన పదేళ్ల చిన్నారి గమ్యాన్ని చేరకుండానే అనంతలోకాలకు వెళ్లిపోయింది. ఆమెను బైక్‌పై తీసుకెళ్తున్న పెద్దమ్మ కుమారుడు కూడా ఇదే ప్రమాదంలో మృతి చెందడం అక్కాచెల్లెళ్ల కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. రఘునాథపాలెం మండలం జింకల తండా క్రాస్‌ వద్ద శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదం వివరాలిలా ఉన్నాయి. రఘునాథపాలెం మండలం శివాయిగూడెంకు చెందిన గార్లపాటి ముత్తయ్య–స్వాతి దంపతులు ఖమ్మం రమణగుట్టలో ఉంటుండగా, ముత్తయ్య ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అలాగే, స్వాతి సోదరి, రఘునాథపాలెం మండలం మల్లేపల్లికి చెందిన గుండేటి సుహాసిని – కృష్ణ దంపతులు జింకలతండా క్రాస్‌ వద్ద గ్రీన్‌కాలనీలో ఉంటున్నారు. పాఠశాలకు సెలవులు రావడంతో స్వాతి చిన్నకుమార్తె, 4వ తరగతి చదువుతున్న రిషిక(10) పెద్దమ్మ ఇంటికి వెళ్తాననగా శనివారం ఉదయం 6గంటలకు సుహాసిని చిన్నకుమారుడు శ్రీను(18) ద్విచక్ర వాహనంపై వచ్చాడు. ‘అన్నయ్యతో కలిసి పెద్దమ్మ ఇంటికి వెళ్తున్నా’ అంటూ తండ్రి ముత్తయ్యకు ముద్దు పెట్టి బై చెబుతుండగా తాను దింపుతానని చెప్పినా వద్దంటూ బయలుదేరింది. ఈమేరకు రిషిక, శ్రీను బైక్‌పై వెళ్తూ జింకలతండా క్రాస్‌ వద్ద రోడ్డు దాటుతుండగా ఇల్లెందు వైపు నుంచి ఖమ్మం వైపు వేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది. దీంతో పిల్లలిద్దరు గాలిలో ఎగిరి రోడ్డుపై పడగా బైక్‌ను కారు ఈడ్చుకుంటూ వెళ్లి ఆగిపోయింది. తీవ్రగాయాల పాలైన రిషిక, శ్రీనును ఆస్పత్రికి తరలించగా మృతి చెందినట్లు నిర్ధారించారు.

పది నిమిషాల్లో వస్తారనుకున్నాం

‘ఇంకో పది నిమిషాల్లో అన్నాచెల్లి వస్తారనుకున్నాం. ఇంతలోనే ఈ విషయం వినాల్సి వచ్చింది’ అంటూ కృష్ణ – సుహాసిని, ముత్తయ్య – స్వాతి దంపతులు రోదిస్తున్న తీరు అందరినీ కంటతడి పెట్టించింది. బంధువులు, కుటుంబీకుల రోదనతో ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీ ప్రాంగణం మిన్నంటింది. కాగా, ప్రమాదానికి కారణమైన కారును భూక్యా కోట్వేరరరావు నడుపుతున్నాడనే సమాచారంతో రిషిక తండ్రి ముత్తయ్య ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు రఘునాథపాలెం సీఐ ఉస్మాన్‌ షరీఫ్‌, ఎస్సై అశోక్‌రెడ్డి తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement