● భూదోపిడీకి పాల్పడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం ● మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: గతంలో ధరణి అమల్లో ఉన్నప్పుడు 22ఏ నిషేధిత జాబితాలో ఎనిమిది లక్షల ఎకరాలు ఉంటే ఇప్పుడు కోటి ఎకరాలు చేర్చారని, ఈ భూములను జాబితా నుంచి తొలగించాలంటే 30 శాతం కమీషన్లు తీసుకుంటున్నారని మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ ఆరోపించారు. ఖమ్మంలో శనివారం జరిగిన బీఆర్‌ఎస్ ముఖ్య నేతల ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ఆస్తులను పరిరక్షించాల్సింది పోయి కొల్లగొడుతూ భూదోపిడీకి పాల్పడుతోందని విమర్శించారు. రెవెన్యూ మంత్రి పొంగులేటి క్షమాపణలు చెప్పి తప్పించుకోవాలని చూస్తున్నారని, కోటి ఎకరాలు నిషేధిత జాబితాలోకి ఎలా వచ్చాయో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయాన అలవికాని హామీలు ఇచ్చి, అధికారంలోకి వచ్చాక పూర్తిస్థాయిలో నెరవేర్చలేదని మండిపడ్డారు. గతంలో కేసీఆర్ ధరణిని తీసుకొచ్చి రైతుల చేతికి పవర్ ఇస్తే, ఇప్పుడు నిషేధిత జాబితాపై సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి పొంగులేటి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
ప్రజల తరఫున ప్రశ్నిస్తూనే ఉంటా..
‘నేను భయపడేవాడిని కాదు. నాది పోరాటాల బ్యాక్ గ్రౌండ్. నేను ఉన్నది పోరాటాల పార్టీలోనే. 30, 40 ఏళ్ల ఇండస్ట్రీ అయినా, ముగ్గురు మంత్రులైనా ఖమ్మం ప్రజల తరఫున ప్రశ్నిస్తూనే ఉంటా’ అని పువ్వాడ తెలిపారు. వంద శాతం రుణమాఫీ అయిందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెబుతున్నా... 25 శాతం కూడా కాలేదని పువ్వాడ విమర్శించారు. ఈ అంశంపై రఘునాథపాలెం మండలంలోని ఏ గ్రామ రైతులతోనైనా చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. ఎల్‌నినో ప్రభావంతో రానున్న రోజుల్లో తాగునీటి సమస్య తీవ్రమయ్యే ప్రమాదం ఉన్నా మంత్రులు సమీక్షించడం లేదని విమర్శించారు. మంత్రిగా తాను ఖమ్మంలో జర్నలిస్టుల కోసం 23 ఎకరాల భూమిని కేబినెట్ ఆమోదంతో జీఓ తీసుకొస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం ఇళ్ల స్థలాలు ఇవ్వకుండా మోసం చేసిందన్నారు. సమావేశం అనంతరం పార్టీ తరఫున బీఎల్‌ఏలుగా ‘సర్’లో పాల్గొన్న వారిని పువ్వాడ సన్మానించారు.
హామీల అమలులో విఫలం
రఘునాథపాలెం: కాంగ్రెస్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు, ఆరు గ్యారంటీలను అమలు చేయడంలో విఫలమైందని మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ విమర్శించారు. రఘునాథపాలెం మండలం మంచుకొండలో నిర్వహించిన పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సమావేశాల్లో నాయకులు ఏనుగుల రాకేష్‌రెడ్డి, కూరాకుల నాగభూషణం, గుండాల కృష్ణ, పగడాల నాగరాజు, శీలంశెట్టి వీరభద్రం, ఖమర్, బచ్చు విజయ్‌కుమార్, మెంతుల శ్రీశైలం, మక్బూల్, బీరెడ్డి నాగచంద్రారెడ్డి, బత్తుల మురళి, నాగండ్ల కోటి, పల్లా రోజ్‌లీనా, షేక్ షకీనా, ఆజ్మీరా వీరునాయక్, భూక్యా లక్ష్మణ్‌నాయక్, మందడుపు నరసింహారావు, మాధవరావు, శంకర్, గుత్తా రవి, మాధంశెట్టి హరిప్రసాద్, పిన్ని కోటేశ్వరరావు, మెంటం రామారావు, చెరుకూరి ప్రదీప్, సైదులు, రవి, నరేష్, క్రాంతి తదితరులు పాల్గొన్నారు.


