● రేషన్ దుకాణాల్లో నిల్వలు నిల్ ● షాపుల చుట్టూ లబ్ధిదారుల ప్రదక్షిణలు
ఖమ్మం సహకారనగర్: మూడు నెలలకు కలిపి ఒకేసారి రేషన్‌షాపుల ద్వారా బియ్యం సరఫరా చేస్తున్న క్రమాన ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ముందస్తు ప్రణాళిక లేకపోవడం, షాపుల్లో బియ్యం నిల్వ చేసేందుకు సరిపడా స్థలం కొరతతో సమస్య వస్తోంది. ఫలితంగా చాలా షాపుల్లో బియ్యం స్టాక్ లేక కార్డుదారులు ప్రదక్షిణలు చేస్తున్నారు. ఇక బియ్యం షాపుల వద్ద గంటల తరబడి క్యూలో ఉండక తప్పడం లేదు. గత ఏడాది నుంచి పలుమార్లు మూడేసి నెలల బియ్యం ఒకేసారి పంపిణీ చేస్తున్నారు. అయితే, చాలా షాపుల్లో ఒక నెలకు సరిపడా బియ్యం నిల్వచేసే స్థలం మాత్రమే ఉంది. దీంతో విడతల వారీగా బియ్యం సరఫరా చేసే క్రమాన జాప్యం జరుగుతోందని తెలుస్తోంది. మరోపక్క ఉపాధి నిమిత్తం వచ్చేవారు వారి స్వస్థలాల్లోని కార్డుల ఆధారంగా పోర్టబులిటీ విధానంలో పట్టణ ప్రాంతాల్లో బియ్యం తీసుకుంటారు. దీంతో పట్టణ ప్రాంతాల్లోని షాపుల్లో త్వరగా స్టాక్ అయిపోతోందని తెలుస్తోంది.
87.78 శాతమే..
జిల్లాలోని పలు షాపుల్లో కార్డుదారులకు సరిపడా బియ్యం చేరలేదు. జిల్లాలోని 748 రేషన్ దుకాణాల పరిధిలో 4,73,271 కార్డులు ఉన్నాయి. వీటి పరిధిలో లబ్ధిదారులకు 24,359.342మెట్రిక్ టన్నుల బియ్యం అవసరమవుతాయి. కానీ 747 షాప్‌లకు గాను ఇప్పటి వరకు 20,895.344 మె.టన్నుల బియ్యం చేరాయి. అంటే 87.78 శాతమే బియ్యం సరఫరా కావడం.. ఆ బియ్యం కూడా ఎప్పటికప్పుడు అయిపోతుండడంతో పెద్దసంఖ్యలో లబ్ధిదారులకు ఎదురుచూపులు తప్పడం లేదు.
రేషన్ షాప్‌ల్లో కార్డుల ఆధారంగా 85శాతం బియ్యం చేరాయి. మరో 15శాతం బియ్యం సరఫరా చేయాల్సి ఉంది. ఒకటి, రెండు రోజుల్లో ఈ బియ్యం కూడా దుకాణాలకు చేరుస్తాం. స్టాక్ ఉన్నంత మేర లబ్ధిదారులకు పంపిణీ చేసేలా డీలర్లు అందుబాటులో ఉండాలని ఆదేశించాం.
– చందన్‌కుమార్,
జిల్లా పౌరసరఫరాల శాఖాధికారి


