కీళ్లు అంతే.. కళ్లూ అంతే... | - | Sakshi
Sakshi News home page

కీళ్లు అంతే.. కళ్లూ అంతే...

Aug 17 2026 12:11 AM | Updated on Aug 17 2026 12:11 AM

నిధుల లేమితో మోకీలు శస్త్రచికిత్సలపై ప్రభావం కంటి విభాగంలోనూ అదే పరిస్థితి

నిధుల కొరత ఉంది..

కంటి విభాగంలో ఓపీపైనా పట్టింపు కరువు

ఎస్‌ఆర్‌లతోనే సరి

ఖమ్మం వైద్యవిభాగం: ఖమ్మం ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రిలో మోకీలు శస్త్రచికిత్సలు ఏడాది కాలంగా నిలిచిపోయాయి. దీంతో పెద్దాస్పత్రిపై నమ్మకంతో వచ్చేవారికి నిరాశ ఎదురవుతుండగా.. అత్యవసర పరిస్థితి ఉన్న వారు హైదరాబాద్‌కు వెళ్లడమో, ప్రైవేట్‌ ఆస్పత్రులను ఆశ్రయించడమో జరుగుతోంది. జనరల్‌ ఆస్పత్రికి నిత్యం 1,200 – 1,500 మంది వైద్యసేవల కోసం వస్తుంటారు. సీజనల్‌ సమయాన ఈ సంఖ్య 2వేలకు పైగా నమోదవుతుంది. ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచే కాక మహబూబాబాద్‌, సూర్యాపేట జిల్లాల నుంచి సైతం ఇక్కడకు వస్తుంటారు.

2022 నుంచి ఆపరేషన్లు

మోకాళ్ల మధ్య గుజ్జు అరగడంతో అక్కడి ఎముకలు రాపిడికి గురై విపరీతమైన నొప్పి ఎదురవుతుంది. ఇలాంటి వారికి మోకీలు మార్పిడి శస్త్రచికిత్సలో అరిగిన భాగం వద్ద కొత్త జాయింట్లు వేస్తారు. తద్వారా మళ్లీ రెండు బొక్కల మధ్య ఖాళీ ఏర్పడి సులువుగా నడవడానికి వీలు ఏర్పడి నొప్పి ఎదురుకాదు. ఈమేరకు పెద్దాస్పత్రిలో మోకీలు మార్పిడి శస్త్రచికిత్సలను 2022 ఆగస్టులో ప్రారంభించారు. వైద్య విధాన పరిషత్‌ పరిధిలో ఉన్నప్పుడు చికిత్సలు మొదలుపెట్టగా కొన్నాళ్లకు నిధుల లేమితో ఆపరేషన్లు నిలిచిపోయాయి. ఆ తర్వాత మెడికల్‌ కళాశాల ఏర్పాటుతో ఆస్పత్రి ఆ పరిధిలోకి వెళ్లాక ఎన్‌ఎంసీ నిబంధల ప్రకారం మోకీలు శస్త్రచికిత్సలు కూడా అందుబాటులోకి తెచ్చారు. ఓ ఏజెన్సీ ద్వారా ఇంప్లాంట్స్‌ సరఫరా చేయడంతో 20 మందికి శస్త్రచికిత్స విజయవంతంగా చేశారు. ఆతర్వాత ఏజెన్సీకి బకాయిలు పేరుకుపోవడం, ఆరోగ్యశ్రీ నుంచి నిధులు రాకపోవడంతో ఇంప్లాంట్స్‌ సరఫరా నిలిచిపోయి శస్త్రచికిత్సలకు గత ఏడాది జూలై నుంచి బ్రేక్‌ పడింది.

రిజిస్ట్రేషన్‌ చేసుకుని ఎదురుచూపులు

పెద్దాస్పత్రి ఆర్థోపెడిక్‌ విభాగంలో ప్రతీరోజు 150 – 200 వరకు ఓపీ నమోదవుతుంది. ఇందులో పలువురికి మోకీలు మార్పిడి శస్త్రచికిత్స అవసరమైనా, సేవలు నిలిచిపోయాయని తెలిసి నిరాశగా వెనుదిరుగుతున్నారు. గత ఏడాదిగా ఆరోగ్యశ్రీ ద్వారా 60 మందికి పైగా రిజిస్ట్రేషన్‌ చేయించుకుని ఎదురుచూస్తున్నారు. ఇంకొందరు వేచిచూసే పరిస్ధితి లేక ప్రైవేట్‌ ఆస్పత్రులను ఆశ్రయించి రూ.లక్ష నుంచి రూ.1.50 లక్షల వరకు భారం భరిస్తున్నారు. ఆరోగ్యశ్రీ ద్వారా ఆపరేషన్లు జరిగిప్పుడు రూ.70వేలకు ఆస్పత్రికి అందేవి. అయితే, ఇంప్లాట్స్‌ కోసం రూ.90వేలు అవసరం కావడంతో మిగతా రూ.20వేలు ఆస్పత్రి నిధుల నుంచి వెచ్చించేవారు. ఈక్రమాన చేసిన ఆపరేషన్లకే ఆరోగ్యశ్రీ నుంచి నిధులు రాకపోవడంతో పాటు ఆస్పత్రి నిధుల కొరతతో ఆపరేషన్లు పూర్తిగా నిలిచిపోయాయి.

జిల్లా జనరల్‌ ఆస్పత్రిలో నిలిచిన ఆపరేషన్లు

నిధుల కొరత వల్ల మోకీలు ఆపరేషన్లు నిర్వహించలేకపోతున్నాం. గతంలో ఇంప్లాంట్లు సమకూర్చిన ఏజెన్సీకి ఇంకా బకాయి ఉంది. ఈ విషయమై ఉన్నతాధికారులకు నివేదించాము. నిధులు విడుదలైతే తిరిగి ఆపరేషన్లు ప్రారంభిస్తాం. – ఎం.నరేందర్‌,

మెడికల్‌ సూపరింటెండెంట్‌, జిల్లా జనరల్‌ ఆస్పత్రి

జనరల్‌ ఆస్పత్రిలో ఆఫ్తాల్మిక్‌(కంటి) విభాగంపై పట్టింపు కరువైంది. గతంలో మాదిరి శస్త్రచికిత్సలు జరగక జనానికి ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. నిత్యం పదుల సంఖ్యలో రెటీనా పరీక్షలు జరగగా, ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఆస్పత్రిలో జనరల్‌ సర్జరీల తర్వాత ఎక్కువ శస్త్రచికిత్సలు కంటి విభాగంలోనే జరుగుతాయి. ఇందుకోసం ప్రత్యేక ఆపరేషన్‌ థియేటర్‌ ఉండడంతో నిత్యం 12 – 15 వరకు శస్త్రచికిత్సలు జరిగేవి. కానీ ప్రస్తుతం 5 – 6 రెటీనా ఆపరేషన్లు నిర్వహించడమే గగనమవుతోంది. కొందరు వైద్యుల నిర్లక్ష్యమే ఇందుకు కారణమని తెలుస్తుండగా.. పేద ప్రజలు వేచిఉండలేక ప్రైవేట్‌ ఆస్పత్రులను ఆశ్రయించి ఆర్థికంగా నష్టపోతున్నారు.

పెద్దాస్పత్రి ఓపీలో వైద్యులు ఉదయం 8–30 గంటలకల్లా ఉండాలి. కానీ ఏ విభాగంలోనూ ఆ పరిస్థితి లేకపోగా కొందరు తాపీగా నచ్చిన సమయంలో వచ్చి ఎప్పుడు వెళ్తున్నారో తెలియడం లేదు. కంటి విభాగంలో ముగ్గురు అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు, ఇద్దరు సీనియర్‌ రెసిడెంట్లు ఉండగా.. పనులన్నీ ఎక్కువగా సీనియర్‌ రెసిడెంట్లతోనే నెట్టుకొస్తున్నారు. అంతేకాక ఓపీలో వైద్యులు ఎక్కువ సేపు ఉండడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. ఫలితంగా శస్త్రచికిత్సలు తగ్గుముఖం పడుతున్నాయి. ఇంకో ముగ్గురు వైద్యుల పోస్టులు ఖాళీగా ఉండడంతో అటు శస్త్రచికిత్సలపై ప్రభావం పడుతుండగా సదరం శిబిరాల్లో వైకల్య పరీక్షలకూ ఇబ్బందులు ఏర్పడుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement