పల్లెవెలుగు పండగ.. | - | Sakshi
Sakshi News home page

పల్లెవెలుగు పండగ..

Aug 17 2026 12:11 AM | Updated on Aug 17 2026 12:11 AM

రూట్‌ సర్వేలు చేస్తున్నాం..

ప్రజాదర్బార్‌ వినతితో..

80శాతానికి పైగా ఓఆర్‌

ఖమ్మంమయూరిసెంటర్‌: కరోనా కాలంలో నిలిపివేసిన పల్లె వెలుగు బస్సు సర్వీసులు మళ్లీ రోడ్డెక్కుతున్నాయి. సుదీర్ఘ విరామం తర్వాత ఖమ్మం రీజియన్‌లోని పలు గ్రామాలకు ఆర్టీసీ రవాణా పునరుద్ధరిస్తుండడంతో ప్రజల్ల్లో ఆనందం వ్యక్తమవుతోంది. బస్సు సౌకర్యం లేక ఇన్నాళ్లు ఉద్యోగులు, పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు, దినసరి కూలీలు పడరాని పాట్లు పడ్డారు. మహాలక్ష్మి పథకానికి దూరం కాగా, అత్యవసర పనుల కోసం ప్రైవేట్‌ వాహనాలను ఆశ్రయించక తప్పలేదు. దీంతో గ్రామస్తుల నుంచి వచ్చే వినతులకు తోడు ప్రజాప్రతినిధులు చొరవతో ఆర్టీసీ అధికారులు సర్వీసులను పునఃప్రారంభించడమే కాక కొత్త రూట్లలో బస్సుల ఏర్పాటుకు అడుగులు వేస్తున్నారు.

14 సర్వీసులు ప్రారంభం

ఉమ్మడి జిల్లాలో ప్రయాణికుల రద్దీ, అవసరాలను దృష్ట్యా కొద్దినెలలుగా 14 బస్సు సర్వీసులను అందుబాటులోకి తీసుకొచ్చారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి, ఎమ్మెల్యేలు కోరం కనకయ్య, జారె ఆదినారాయణ సిఫారసులతో ఇల్లెందు, మధిర, ఖమ్మం, కొత్తగూడెం, సత్తుపల్లి డిపోల నుంచి ఈ బస్సులను ప్రారంభమయ్యాయి. ఫలితంగా ఇన్నాళ్లు అష్టకష్టాలు పడ్డ ప్రజలు ఆర్టీసీ వైపే మొగ్గు చూపుతుండడంతో పల్లెవెలుగు బస్సులు కళకళలాడుతున్నాయి.

రీజియన్‌లో బస్సు సౌకర్యం లేని గ్రామాలకు సర్వీసుల కోసం ప్రజాప్రతినిధుల నుంచి లేఖలు అందుతున్నాయి. ఈ లేఖలతో పాటు ప్రజల వినతులను పరిగణనలోకి తీసుకొని రూట్‌ సర్వేలు చేస్తున్నాం. ఏ డిపో నుంచి ఏ రూట్‌లో నడిపితే ఎక్కువ మందికి లాభం ఉంటుందో పరిశీలిస్తున్నాం. ఈ ఏడాది ఇప్పటివరకు 14 రూట్లలో బస్సులు ప్రారంభించాం.

– ఏ.సరిరామ్‌, ఆర్టీసీ ఆర్‌ఎం, ఖమ్మం రీజినల్‌

ఇటీవల కల్లూరులో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నేతృత్వాన ప్రజాదర్బార్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా మండలంలోని ఎర్రబోయినపల్లికి చెందిన రెండో తరగతి విద్యార్థి నల్లగట్ల క్రిశాంక్‌ వచ్చి తమ గ్రామానికి బస్సు సౌకర్యం లేదని విన్నవించాడు. దీంతో మంత్రి సూచనల మేరకు సర్వే చేపట్టిన ఆర్టీసీ అధికారులు మధిర నుంచి కల్లూరుకు ఉన్న బస్సును పంద్రాగస్టు సందర్భంగా చెన్నూరు, ఎర్రబోయినపల్లి(కొత్త), లింగాల మీదుగా నడిపించడం మొదలుపెట్టారు.

ముదిగొండ మండలం పమ్మి గ్రామానికి కరోనాకు పూర్వం బస్సు ఉండేది. కరోనా సమయాన రద్దు చేయడంతో ఆ గ్రామంతో పాటు చిరుమర్రి, సువర్ణాపురం, లక్ష్మీపురం, ముదిగొండ నుంచి ఖమ్మం వచ్చేవారు ఇబ్బంది పడుతున్నారు. గ్రామస్తుల వినతులు, డిప్యూటీ సీఎం భట్టి సూచనలతో రెండు నెలల క్రితం పమ్మికి బస్సు ఏర్పాటైంది. రోజుకు మూడు ట్రిప్పులు నడుస్తున్న బస్సులో 80 శాతానికి పైగా ఓఆర్‌ నమోవుతుండగా, సీజన్‌లో రద్దీ మరింత పెరగనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement