ఐకేపీలో వీఓఏల కొరత | - | Sakshi
Sakshi News home page

ఐకేపీలో వీఓఏల కొరత

Aug 9 2026 1:46 AM | Updated on Aug 9 2026 1:46 AM

ఫలితంగా పర్యవేక్షణ కరువు, లావాదేవీల్లో జాప్యం కుంటుపడుతున్న మహిళా సంఘాల నిర్వహణ, అభివృద్ధి లక్ష్యానికి దూరమవుతున్న సంఘాలు

వీఓఏలను ఏర్పాటు చేస్తాం

పర్యవేక్షణ అంతంతే..

చింతకాని: గ్రామీణ ప్రాంతాల్లో స్వయం సహాయక సంఘాలను బలోపేతం చేయడం, సంక్షేమ పథకాలను క్షేత్రస్థాయికి చేరవేయడంలో ఐకేపీ (ఇందిరా క్రాంతి పథం) గ్రామ సంఘాల సహాయకులు (వీఓఏ) కీలకపాత్ర పోషిస్తారు. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్‌) మార్గదర్శకాలకు అనుగుణంగా పనిచేస్తూ మహిళల ఆర్థికాభివృద్ధి, సాధికారతకు వెన్నెముకగా నిలవాల్సి ఉంటుంది. మహిళా సంఘాల్లో ఐక్యతను పెంచి క్రమం తప్పక పొదుపు చేసేలా ప్రోత్సహించడం, సీ్త్రనిధి, బ్యాంకుల ద్వారా సంఘాలకు రుణాలను ఇప్పించి రికవరీ ప్రక్రియను పర్యవేక్షించడమే కాక సంఘాల ఆర్థిక లావాదేవీలకు నిర్వహణలో చేయూతనిస్తారు. కానీ, జిల్లాలో వీఓఏలు సరిపడా లేకపోవడంతో సంఘాల అభివృద్ధి కుంటుపడుతోంది. సంఘాల ఏర్పాటు, రుణాల మంజూరులోనే కాక అంతర్గత పొదుపు, వసూళ్లు కూడా సక్రమంగా సాఫీగా జరగడం లేదు. మరోపక్క ప్రతీనెల సంఘాల రికార్డులు, బ్యాంక్‌ పాస్‌పుస్తకాల తనిఖీ సాఫీగా జరగకపోవడంతో సభ్యులు రుణ వాయిదాలు చెల్లిస్తున్నా లీడర్లు బ్యాంక్‌లో జమచేయకుండా సొంత అవసరాలకు వాడుకుంటున్నారు. జిల్లాలో ఇలాంటి ఉదంతాలు వెలుగుచూస్తున్నా వీఓఏల నియామకంపై అధికారులు దృష్టిసారించడం లేదు.

24 వేలకు పైగా సంఘాలు..

921 మంది వీఓఏలు

జిల్లాలోని 20 మండలాల్లో 2,42,090 మంది మహిళా సభ్యులతో కూడిన 24,797 స్వయం సహాయక సంఘాలు కొనసాగుతున్నాయి. మహిళా సంఘాలను సమర్థవంతంగా నడిపించాలంటే నిబంధనల ప్రకారం 20 సంఘాలకు ఒక వీఓఏను నియమించాలి. అంటే జిల్లాలో 1,240 మంది వీఓఏలు పనిచేయాల్సి ఉండగా, 921 మందే ఉన్నారు. ఫలితంగా కొత్త సంఘాల ఏర్పాటు, ఆర్థిక లావాదేవీల పర్యవేక్షణ, రికార్డుల నిర్వహణ, రుణాల మంజూరు, రికవరీలో జాప్యం జరుగుతోంది. ఫలితంగా మహిళా సంఘాలు, సభ్యుల ఆర్థికాభివృద్ధికి ఆటంకం ఏర్పడుతోంది.

ఏయే గ్రామాల్లో అత్యవసరంగా వీఓఏల నియామకం అవసరమో గుర్తించి ఏర్పాటుకు తగిన చర్యలు తీసుకుంటాం. అంతేకాక డిజిటల్‌ లావాదేవీలు జరిపేలా సభ్యులకు అవగాహన కల్పిస్తున్నాం. నగదు సొంతానికి వాడుకునే సభ్యులపై చర్యలు తీసుకుంటాం.

–కొండపల్లి శ్రీరామ్‌, డీఆర్‌డీఓ

సంఘాల సంఖ్యకు అనుగుణంగా వీఓఏలు లేకపోవడంతో పర్యవేక్షణ సాఫీగా సాగడం లేదు. రికార్డుల నిర్వహణ, రుణాల మంజూరులో వీఓఏలు కీలకంగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఉన్నతాధికారులు స్పందించి నియామకాలు చేపట్టాలి. – గంధం కవిత,

చింతకాని మండల సమాఖ్య అధ్యక్షురాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement