నేడు మంత్రి పొంగులేటి పర్యటన | - | Sakshi
Sakshi News home page

నేడు మంత్రి పొంగులేటి పర్యటన

Aug 6 2026 12:39 AM | Updated on Aug 6 2026 12:39 AM

ఖమ్మంమయూరిసెంటర్‌: రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గురువారం జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 11 గంటలకు కూసుమంచి మండలం రాజుపేట బజార్‌ తాళ్లగడ్డ తండాలో ఈశ్వరమాదారం – భద్రుతండా మధ్య నిర్మించే బీటీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేస్తారు. ఆతర్వాత చౌటుపల్లిలో బీరోలు వెళ్లే ఆర్‌అండ్‌బీ రోడ్డుపై హైలెవల్‌ బ్రిడ్జి, లింగారం తండాలో బీటీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. అలాగే, సాయంత్రం ఏదులాపురం మున్సిపాలిటీ పరిధి గుదిమళ్లలో ప్రకాష్‌నగర్‌ హైలెవల్‌ బ్రిడ్జి నుంచి గుదిమళ్ల వరకు బీటీ రోడ్డు, ఖమ్మంరూరల్‌ మండలం కామంచికల్‌లో కోయచెలక వరకు బీటీ రోడ్డు నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేస్తారు.

ఉమ్మడి జిల్లాలో బీఎస్‌ఎన్‌ఎల్‌ 4జీ, 5జీ సేవలు

ఖమ్మంమయూరిసెంటర్‌: భారత్‌నెట్‌ ద్వారా తెలంగాణలో బ్రాడ్‌బ్యాండ్‌ సేవలు, మొబైల్‌ నెట్‌వర్క్‌ విస్తరణపై కేంద్ర ప్రభుత్వం లోక్‌సభలో కీలక వివరాలను వెల్లడించింది. పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాల్లో భాగంగా ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి బుధవారం లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా డిజిటల్‌ పాలన, విద్య, వైద్యం, ఆర్థికాభివృద్ధిని ప్రోత్సహించేందుకు టెలికాం మౌలిక వసతులను వేగవంతం చేస్తున్నట్లు తెలిపారు. ఖమ్మం జిల్లాలో 356 గ్రామాలు మొబైల్‌ నెట్‌వర్క్‌ కలిగి ఉండగా, 355 గ్రామాలు 4జీ, 5జీ పరిధిలోకి వచ్చాయని వెల్లడించారు. అలాగే, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 361 గ్రామాల్లో మొబైల్‌ నెట్‌వర్క్‌ ఉండగా.. అందులో 357 గ్రామాల్లో 4జీ, 5జీ సేవలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.

నేటి నుంచి సీపీఐ

ప్రజా చైతన్య యాత్రలు

ఖమ్మంమయూరిసెంటర్‌: సీపీఐ జాతీయ సమితి పిలుపులో భాగంగా జిల్లా సమితి ఆధ్వర్యాన గురువారం నుంచి ప్రజా చైతన్య పాదయాత్రలు నిర్వహించనున్నా రు. తొలిరోజు పాదయాత్రను ఖమ్మం రూరల్‌ మండలం తల్లంపాడు హైవే జంక్షన్‌ వద్ద పార్టీ జాతీయ సమితి సభ్యుడు బాగం హేమంతరావు ప్రారంభిస్తారు. ఈనెల 13వ తేదీ వరకు 20 మండలాల్లో పాదయాత్రలు జరుగుతాయ ని జిల్లా కార్యదర్శి దండి సురేష్‌ తెలిపారు. కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరిస్తూ వారిని చైతన్యపరిచేందుకు పాదయాత్ర నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. అంతేకాక రాష్ట్రంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలులో చేస్తున్న తీవ్ర జాప్యాన్ని కూడా ప్రజల్లోకి తీసుకెళ్తామని తెలిపారు.

డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలకు

‘దోస్త్‌’ రిజిస్ట్రేషన్లు

ఖమ్మం సహకారనగర్‌: డిగ్రీ ప్రథమ సంవత్సరంలో ప్రవేశాలకు దోస్త్‌ స్పెషల్‌ డ్రైవ్‌ ఫేజ్‌–2 గురువారం మొదలుకానుందని ఖమ్మంలోని ఎస్‌ఆర్‌బీజీఎన్‌ఆర్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ మహ్మద్‌ జాకీరుల్లా తెలిపారు. ఈమేరకు గురువారం నుంచి 11వ తేదీ వరకు రిజిస్ట్రేషన్లకు అవకాశం ఉండగా, 12వరకు వెబ్‌ ఆప్షన్లు పెట్టుకోవచ్చని పేర్కొన్నారు. గతంలో రిజిస్ట్రేషన్‌ చేయని వారికి ఇదే చివరి అవకాశమని, వివరాలకు కళాశాల హెల్ప్‌లైన్‌ సెంటర్‌లో సంప్రదించాలని సూచించారు.

పాత మున్నేరు వంతెనపై రాకపోకలకు అనుమతి

ఖమ్మంక్రైం: ఖమ్మం కాల్వొడ్డు–జలగంనగర్‌ మధ్య వంతెనపై మున్నేటి వరద ప్రవహించడంతో తాత్కాలికంగా నిర్మించిన చప్టాలు దెబ్బ తిన్నాయి. దీంతో ఈ మార్గంలో బుధవారం నుంచి వాహనాల రాకపోకలను నిలిపివేశారు. అయితే వాహనదారుల ఇబ్బందుల దృష్ట్యా ఇన్నాళ్లు రాకపోకలు నిలిపివేసిన పాత మున్నేరు వంతెనపై ద్విచక్రవాహనాలను వెళ్లేలా తాత్కాలికంగా అనుమతించాలని సీపీ సునీల్‌దత్‌ ట్రాఫిక్‌ పోలీసులను ఆదేశించారు. ఈమేరకు బుధవారం ఆయన పాత మున్నేరు బ్రిడ్జిని పరిశీలించి సూచనలు సైతం చేశారు. అయితే, కేవలం ద్విచక్రవాహనాలు మాత్రమే అనుమతి ఇవ్వాలని తెలిపారు. ట్రాఫిక్‌, త్రీటౌన్‌ సీఐలు సత్యనారాయణ, మోహన్‌బాబు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement