ఖమ్మం సహకారనగర్: ప్రజలు అప్రమత్తంగా ఉండడంతో పాటు అవగాహన పెంపొందించుకుంటేనే సైబర్ నేరాల కట్టడి సాధ్యమవుతుందని పోలీసు కమిషనర్ సునీల్‌దత్ తెలిపారు. సైబర్ క్రైమ్ విభాగం ఆధ్వర్యాన చేపడుతున్న ‘సురక్ష కా తిరంగా – సైబర్ స్వతంత్ర తెలంగాణ’ కార్యక్రమంలో భాగంగా ఖమ్మంలోని ఎస్‌ఆర్ కాలేజీలో బుధవారం నిర్వహించిన అవగాహన సదస్సులో సీపీ మాట్లాడారు. ప్రస్తుత తరుణాన సాంకేతిక పరిజ్ఞానం జీవితాలను సులభతరం చేసినా, అదే సాంకేతికతను దుర్వినియోగం చేస్తూ నేరగాళ్లు ప్రజల సొమ్ము, వ్యక్తిగత సమాచారం, గోప్యతపై దాడులు చేస్తున్నారని తెలిపారు. సైబర్ నేరాల నివారణకు పౌరులు బ్యాంకు ఖాతా వివరాలు, ఓటీపీలను ఇతరులకు చెప్పొద్దని సూచించారు. అంతేకాక నకిలీ వెబ్‌సైట్లు, యాప్‌లు, సామాజిక మాధ్యమాల్లో పెట్టుబడి ప్రకటనలు, డిజిటల్ అరెస్టులను నమ్మొద్దని తెలిపారు. సాధారణ ప్రజల్లో అవగాహన వేగంగా పెరగకపోవడం సమస్యను క్లిష్టతరం చేస్తున్నందున ప్రతీనెల వందల సంఖ్యలో సైబర్ మోసాలపై ఫిర్యాదులు నమోదవుతున్నాయని చెప్పారు. ఈమేరకు మోసపోయినట్లు గ్రహించగానే 24గంటలకు పనిచేసే టోల్‌ఫ్రీ నంబర్ 1930కు ఫిర్యాదు చేయాలని సీపీ సూచించారు. ఈకార్యక్రమంలో సైబర్ క్రైమ్ డీఎస్పీ ఫణిందర్, ఇన్‌స్పెక్టర్లు కరుణాకర్, బాలకృష్ణ, మోహన్‌బాబు, భానుప్రకాష్, ఉస్మాన్ షరీఫ్, రవికుమార్, ఎస్సైలు రంజిత్‌కుమార్, విజయ్‌కుమార్ పాల్గొన్నారు.
పోలీసు కమిషనర్ సునీల్‌దత్


