మధిర: మధిరలో రోడ్డు విస్తరణ పనులకు ఎట్టకేలకు మోక్షం కలిగింది. ‘సాక్షి’లో జూలై 27న ‘కాలక్షేపమా... నిర్లక్ష్యమా’ శీర్షికన కథనం ప్రచురితమైంది. మధిరలోని ఆర్‌వీ కాంప్లెక్స్ నుంచి ఆత్కూరు క్రాస్ వరకు, మధిర నుంచి ఎర్రుపాలెం వరకు రహదారి విస్తరణ పనులకు 2024 డిసెంబర్ 15న శంకుస్థాపన చేసినా నేటికీ పనులు చేపట్టకపోవడాన్ని ఈ కథనంలో ప్రస్తావించగా ఆర్‌అండ్‌బీ అధికారులు స్పందించారు. ఈమేరకు బుధవారం ఇల్లెందులపాడు నుంచి ఆత్కూరు సర్కిల్ వరకు రోడ్డుకిరువైపులా ఆక్రమణలు, దుకాణాల ముందు ఏర్పాటుచేసిన షెడ్లును తొలగించే పనులు మొదలుపెట్టారు. మున్సిపల్ కమిషనర్ శామ్యూల్, ఆర్‌అండ్ బీ ఏఈ రాంబాబు, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ భాస్కర్ తదితరుల సమక్షాన తొలగింపు చేపడుతుండగా, సీపీఎం, బీఆర్‌ఎస్, టీడీపీ నాయకులు అడ్డుకున్నారు. ముందస్తు సమాచారం లేకుండా తొలగించడం సరికాదని పేర్కొన్నారు. ఈ విషయంపై మున్సిపల్ కమిషనర్ శామ్యూల్ స్పందిస్తూ డివైడర్ నుంచి 50 అడుగుల మేర ఆర్‌అండ్ బీ రోడ్డు ఉంటుందని, ఆ పరిధిలో కట్టడాలను ఈనెల 10లోగా స్వచ్ఛందంగా తొలగించాలని, లేనిపక్షంలో నోటీసులు లేకుండా తామే తొలగిస్తామని స్పష్టం చేశారు.
అనుమతులు ఎలా ఇచ్చారు?
మధిర ఆక్రమణల తొలగింపును వివిధ పార్టీల నాయకులు అడ్డుకున్నారు. అధికారులు అనుమతి ఇచ్చే సమయాన నిబంధనలను పరిశీలించి ఉంటే ప్రస్తుత పరిస్థితి వచ్చేది కాదని పేర్కొన్నారు. నిర్మాణాల కోసం ప్రజలు రూ.లక్షల్లో వెచ్చించినందున ముందస్తు సమాచారం, నోటీసులు లేకుండా కొలతలు వేసి కూల్చివేయడం సరికాదని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు పాపినేని రామనర్సయ్య, బిక్కి కృష్ణప్రసాద్, చేకూరి శేఖర్‌బాబు తదితరులు పాల్గొన్నారు.


