● రైతుల సమక్షాన పారదర్శకంగా రీసర్వే ● కలెక్టర్ దివాకర టీ.ఎస్.
నేలకొండపల్లి: భూముల రీసర్వే ద్వారా భూ సమస్యలు వంద శాతం పరిష్కారమవుతాయని కలెక్టర్ దివాకర టీ.ఎస్. వెల్లడించారు. నేలకొండపల్లి మండలం కొంగరలో బుధవారం జరిగిన భూ భారతి... భూసర్వే గ్రామసభలో ఆయన పాల్గొన్నారు. రైతుల సందేహాలు నివృత్తి చేశాక కలెక్టర్ మాట్లాడారు. పాస్ పుస్తకంలో భూమి ఉండి, క్షేత్ర స్థాయిలో లేకున్నా.. తక్కువ, ఎక్కువగా నమోదైనా సర్వేతో పరిష్కారమవుతాయని తెలిపారు. సర్వే విషయమై 48గంటల ముందే సమాచారం ఇస్తున్నందున రైతులు సహకరించాలని సూచించారు. సర్వే అనంతరం అభ్యంతరాలు వ్యక్తమైనా పరిష్కరిస్తామని తెలిపారు. ఆధునిక యంత్రాలతో రైతుల సమక్షాన సర్వే చేస్తున్నందున హద్దుల నిర్ధారణలో ఇబ్బంది రాదని చెప్పారు. ఈ సర్వేతో భూ వివాదాలు గణనీయంగా తగ్గి రైతుల భూమికి భద్రత కలుగుతుందని తెలిపారు. జిల్లాలోని బేతుపల్లి, కాకరవాయిలో సర్వే కొనసాగుతుండగా, కొంగరలో త్వరలోనే ప్రారంభిస్తామని వెల్లడించారు. అనంతరం బుద్ధారంలో గ్రామ సమాఖ్య భవన నిర్మాణాన్ని కలెక్టర్ పరిశీలించారు. మార్కెట్ చైర్మన్ వెన్నపూసల సీతారాములు, తహసీల్దార్ పి.రాంప్రసాద్, ఎంపీడీఓ ఎం.యర్రయ్య, సర్పంచ్ కృష్ణకుమారి, ఉద్యోగులు, నాయకులు కనకం నరసింహారావు, ఆలస్యం మధుసూధన్‌రావు, చిట్టూరి శ్రీనివాసరావు, నల్లాని మల్లికార్జున్‌రావు, ఈవూరి శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు.


