ఖమ్మంవ్యవసాయం: కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ఫ్రేమ్ వర్క్ ఫర్ ఫర్టిలైజర్ సేల్(ఎఫ్‌ఎఫ్‌ఎస్ ) యాప్ ద్వారా శుక్రవారం నుంచి ఎరువుల విక్రయాలు జరుగుతాయని జిల్లా వ్యవసాయ అధికారి(డీఏఓ) ధనసరి పుల్లయ్య తెలిపారు. ఇప్పటివరకు అమల్లో ఉన్న ఫర్టిలైజర్ బుకింగ్ యాప్ స్థానంలో కేంద్ర ప్రభుత్వం ఎఫ్‌ఎఫ్‌ఎస్ యాప్‌ను తీసుకురాగా, తొలి దశలో జిల్లాను అనుసంధానం చేస్తున్నట్లు వెల్లడించారు. రైతులు యూరియా, డీఏపీ, పొటాష్‌తో పాటు ఇతర కాంప్లెక్స్ ఎరువులను ఈ యాప్ ద్వారానే కొనుగోలు చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. పట్టాదారు రైతులు, ఎన్‌డీఎస్ రైతులు, కౌలు రైతులు తమ ఫార్మర్ ఐడీ లేదా ఆధార్ నంబర్ ఆధారంగా ఎరువులు బుక్ చేసుకుని, ఏ మండలంలోనైనా కొనుగోలు చేసే సౌకర్యం ఉంటుందని తెలిపారు. ఎవరికై నా ఇబ్బందులు వస్తే ఏఓలు, ఏఈఓలతో పాటు డీఏఓ కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు. కాగా, ఇప్పటివరకు అమల్లో ఉన్న టోల్‌ఫ్రీ నంబర్ 1800–123–7157 కూడా కొనసాగుతుందని ఆయన తెలిపారు.
పోలీసు సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా హేమనాథ్
ఖమ్మంక్రైం: జిల్లా పోలీసు సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా హేమనాథ్ ఎన్నికయ్యారు. పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో బుధవారం రాత్రి జరిగిన ఎన్నికల్లో అన్ని పోలీసుస్టేషన్ల నుంచి ఎన్నికై న 44 మంది ఈసీ మెంబర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈక్రమాన హేమనాథ్‌కు 26 ఓట్లు నమోదు కాగా, ఆయన ప్రత్యర్థి రమేష్‌కు 18 ఓట్లు రావడంతో ఎనిమిది ఓట్ల తేడాతో హేమనాథ్ విజయం సాధించారు. ఆయన ప్రస్తుతం సీసీ కార్యాలయంలోని ఐటీ కోర్‌లో హెడ్‌కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. మిగతా కార్యవర్గాన్ని గురువారం ఎన్నుకోనున్నారు. కాగా, 13ఏళ్ల ఎన్నికలు జరగడంతో మొదటి నుంచి ఉత్కంఠగానే సాగాయి.


