ఖమ్మం అర్బన్: పాఠశాలల్లో విద్యా ప్రమాణాల పెంపుతో పాటు పరిశుభ్రమైన వాతావరణం కల్పించేలా ఉపాధ్యాయులు బాధ్యతగా వ్యవహరించాలని కలెక్టర్ దివాకర టీ.ఎస్. సూచించారు. ఖమ్మం 8వ డివిజన్ వైఎస్సార్ కాలనీలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాల నిర్వహణ, విద్యార్థుల హాజరు, మౌలిక వసతులు, మధ్యాహ్న భోజనం అమలు, పరిశుభ్రతపై ఆరా తీయడమే కాక విద్యార్థులకు పాఠ్యాంశాల్లో ప్రశ్నలు వేసి సమాధానాలు రాబడుతూ వారి సామర్థ్యాలను పరీక్షించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ పాఠశాల వయస్సు పిల్లలను బడిలో చేర్పించడమే కాక వంద శాతం హాజరయ్యేలా ఉపాధ్యాయులు పర్యవేక్షించాలని తెలిపారు. నాణ్యమైన బోధన, మధ్యాహ్న భోజనంలో ప్రమాణాలను పాటించాలని ఆదేశించారు.


