● రఘునాథపాలెంలో పరిశీలించిన కలెక్టర్ దివాకర ● ‘సాక్షి’లో ప్రచురితమైన కథనంతో పనులపై ఆరా
రఘునాథపాలెం: యంగ్ ఇండియా సమీకృత గురుకులాల నిర్మాణ పనులను నిర్ణీత గడువులోగా నాణ్యత ప్రమాణాలతో పూర్తి చేయాలని కలెక్టర్ దివాకర టీ.ఎస్. ఆదేశించారు. విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని అంతర్జాతీయ ప్రమాణాలతో రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలలను నిర్మిస్తున్న విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలని తెలిపారు. రఘునాథపాలెం బెపాస్‌రోడ్డు ప్రధాన రహదారి వద్ద రూ.200 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ పనులను గురువారం కలెక్టర్ పరిశీలించారు. ‘సాక్షి’లో గురువారం జిల్లాలోని ఇంటిగ్రేటెడ్ గురుకులాల పనులపై కథనం రాగా, లక్ష్మీపురంలో వేగంగా జరుగుతుండడం.. మిగతా చోట్ల జాప్యం జరుగుతోందని ప్రస్తావించగా కలెక్టర్ స్పందించిట్లు తెలిసింది. ఈమేరకు రఘునాథపాలెంలో హాస్టల్ భవనాలు, అకడమిక్ బ్లాక్‌లు, డార్మిటరీ, వంటగది, భోజనశాల, ఉద్యోగుల క్వార్టర్ల ర్మాణ పనులను పరిశీలించి పురోగతిపై అధికారులను ఆరా తీశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో నియోజకవర్గానికి ఒకటి చొప్పున ఐదు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల నిర్మాణాలు కొనసాగుతున్నాయని తెలిపారు. నాణ్యత రాజీ పడకుండా పనుల్లో వేగం పెంచి గడువులోగా పూర్తయ్యేలా చూడాలని సూచించారు. ఆవరణలో అంతర్గత రహదారులు, డ్రెయినేజీల నిర్మాణం, తాగునీరు, విద్యుత్ వసతులపై దృష్టి సారించాలని తెలిపారు. అనంతరం రఘునాథపాలెంలో గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యాన నిర్మిస్తున్న స్కూల్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ బాలుర గురుకుల పాఠశాల, కళాశాల భవన నిర్మాణ పనులను కూడా కలెక్టర్ పరిశీలించి నెలలోగా అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు. రఘునాథపాలెం తహసీల్దార్ శ్వేత, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.


