ఖమ్మంలీగల్: అర్హులైన పేద అండర్ ట్రయల్ ఖైదీలకు ఉచిత న్యాయ సాయం అందిస్తామని జిల్లా న్యాయ సేవా సంస్థ కార్యదర్శి పి.దేవీమానస తెలిపారు. జిల్లా కారాగారాన్ని గురువారం సందర్శించిన ఆమె జైలు పరిసరాలు, ఖైదీలకు కల్పిస్తున్న సౌకర్యాలను పరిశీలించారు. అనంతరం అండర్ ట్రయల్ ఖైదీలతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. ఖైదీల హక్కుల పరిరక్షణతో పాటు, న్యాయం అందరికీ చేరువ చేయడమే న్యాయ సేవా సంస్థల ప్రధాన లక్ష్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కారాగారం సూపరింటెండెంట్ శ్రీధర్, జైలు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. అనంతరం జిల్లా న్యాయ సేవా సంస్థ కార్యదర్శి దేవీమానస ఖమ్మంలోని మదర్ థెరిస్సా అనాథాశ్రమాన్ని సందర్శించి ఆశ్రయం పొందుతున్న వారితో మాట్లాడారు. గృహంలో కల్పిస్తున్న వసతులపై ఆరా తీశారు. అవసరమైన సేవలు మరింత మెరుగ్గా అందించాలని ను నిర్వాహకులకు సూచించారు. అలాగే, లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆధ్వర్యాన అమల్లో ఉన్న పథకాలు, ఉచిత న్యాయ సాయంపై అవగాహన కల్పించారు.
17లోగా పరీక్ష ఫీజు చెల్లించండి
ఖమ్మం సహకారనగర్: తెలంగాణ ఓపెన్ స్కూల్‌లో పదో తరగతి, ఇంటర్‌మీడియట్‌లో ప్రవేశాలు పొందిన అభ్యర్థులు ఆగస్టు 1నుంచి 17వ తేదీ పరీక్ష ఫీజు చెల్లించాలని డీఈఓ సదానందం, ఓపెన్‌స్కూల్ ఉమ్మడి జిల్లా కో ఆర్డినేటర్ కూరపాటి మంగపతిరావు సూచించారు. పదో తరగతి అభ్యర్థులకు థియరీ, ప్రాక్టికల్ సబ్జెక్టులకు రూ.100చొప్పున ఇంటర్ అభ్యర్థులు రూ.150 ఫీజు చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. అయితే, సబ్జెక్టుకు రూ.25 అపరాధ రుసుంతో ఆగస్టు 18నుంచి 24వ తేదీ వరకు, రూ.50 అపరాధ రుసుంతో ఆగస్టు 25నుంచి 29వ తేదీ వరకు, తత్కాల్ స్కీమ్ ద్వారా సాధారణ పరీక్ష ఫీజుతో పాటు అదనంగా పదో తరగతి అభ్యర్థులు రూ.500, ఇంటర్ అభ్యర్థులైతే రూ.వేయి ఆగస్టు 30వ తేదీ నుంచి సెప్టెంబర్ 2వ తేదీ వరకు చెల్లించే అవకాశముందని పేర్కొన్నారు. అభ్యర్థులు సంబంధిత సెంటర్‌లో సంప్రదించి www. telanganaopenschool.org వెబ్‌సైట్‌లో లేదా టీఎస్ ఆన్‌లైన్ / మీ సేవ కేంద్రాల్లో ఫీజు చెల్లించాలని సూచించారు.
ప్రశాంతంగా గురుకుల ప్రవేశపరీక్ష
వన్యప్రాణుల సంరక్షణకు పటిష్ట చర్యలు
సత్తుపల్లిటౌన్: అడవుల్లో జంతు వేట జరగకుండా చూస్తూ వణ్యప్రాణుల సంరక్షణకు పటిష్ట చర్యలు చేపట్టాలని డీఎఫ్‌ఓ అనూజ్ అగర్వాల్ సూచించారు. సత్తుపల్లి డివిజనల్ ఫారెస్ట్ కార్యాలయంలో గురువారం రికార్డులను తనిఖీ చేశారు. అనంతరం రామచంద్రాపురం బీట్‌లో ని పది హెక్టార్లలో చేపట్టిన మొక్కలు నాటే పనులను పరిశీలించి ఉద్యోగులకు సూచనలు చేశారు. అడవుల పరిరక్షణ, వన్యప్రాణు ల సంరక్షణకు పకడ్బందీ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. సత్తుపల్లి రేంజర్ సీహెచ్.ఎల్లయ్య, డీఆర్‌ఓ అచ్చయ్య, సెక్షన్ ఆఫీసర్ భాస్కర్, ఎఫ్‌బీఓ అశోక్‌కుమార్ పాల్గొన్నారు.


