భూసర్వేతో సమస్యలకు
శాశ్వత పరిష్కారం
వచ్చే నెల నుంచి కొత్త పింఛన్లు
కల్లూరు ప్రజాదర్బార్‌లో
రాష్ట్ర మంత్రి పొంగులేటి
కల్లూరు రూరల్: రాష్ట్రంలోని పేదలందరికీ ప్రభుత్వ పథకాలే అందించడమే లక్ష్యంగా తమ ప్రభుత్వ పాలన సాగుతోందని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. కల్లూరులో గురువారం సాయంత్రం ఏర్పాటుచేసిన ప్రజాదర్బార్‌లో ఆయన ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి, కలెక్టర్ దివాకర టీ.ఎస్.తో కలిసి ప్రజల నుంచి దరఖాస్తులు, వినతిపత్రాలు స్వీకరించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ పేదరికమే అర్హతగా భావించి రాజకీయాలకు అతీతంగా ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పతకాలు అందిస్తున్నామని చెప్పారు. ప్రజల సమస్యలను తెలుసుకుని తక్షణ పరిష్కారం కోసం ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
పేదల ఆత్మగౌరవానికి చిహ్నం
పేదల ఆత్మగౌరవానికి సొంత గృహం చిహ్నంగా నిలుస్తుందని మంత్రి పొంగులేటి తెలిపారు. ఈ విషయాన్ని గత ప్రభుత్వం విస్మరిస్తే, తాము అధికారంలోకి రాగానే ఇందిరమ్మ గృహాలు మంజూరు చేస్తున్నామని చెప్పారు. మొదటి దశ నిర్మాణాలు చివరి దశకు చేరగా, రెండో విడత మంజూరవుతున్నాయని తెలిపారు. చివరి అర్హుల వరకు ఫలితం దక్కేలా మూడు, నాలుగో విడత కూడా మంజూరు చేస్తామన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేకున్నా పేదలకు సంక్షేమ పథకాల అమలు, అభివృద్ధి పనుల విషయంలో తాము విజయం సాధించామని చెప్పారు. కాగా, అర్హులకు వచ్చే నెల నుంచి కొత్తగా పెన్షన్లు మంజూరవుతాయని మంత్రి ఈ సందర్భంగా వెల్లడించారు.
బీఆర్‌ఎస్ బండారం బట్టబయలు
ధరణి చట్టంలో లొసుగులను అడ్డం పెట్టుకొని గత ప్రభుత్వ పెద్దలు విలువైన భూములను కొల్లగొట్టారని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. గత పాలకుల అక్రమాలు త్వరలో బయట పెడతామని, తప్పు చేసిన వారు శిక్ష అనుభవించాల్సిందేనని చెప్పారు. కాగా, తాము అధికారంలోకి రాగానే రాష్ట్రమంతగా సమగ్ర భూసర్వేకు చుట్టామని తెలిపారు. ఇప్పటికే పైలట్‌గా కొన్ని గ్రామాల్లో సర్వే చేస్తుండగా, అన్ని చోట్ల సర్వే అనంతరం భూసమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని తెలిపారు. కాగా, ఎస్‌ఐఆర్‌లో ప్రతీ ఓటరు నమోదు చేసుకునేలా కాంగ్రెస్ శ్రేణులు పర్యవేక్షించాలని సూచించారు. ఇంకా ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి, సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్, ఏసీబీ వసుంధర యాదవ్, కల్లూరు మున్సిపల్ చైర్‌పర్సన్ ధరావత్ మోహన్‌నాయక్, మార్కెట్ చైర్‌పర్సన్ బాగం నీరజాదేవి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు పోట్రూ అర్జున్‌రావు తదితరులు పాల్గొన్నారు. తొలుత మంత్రి పొంగులేటి తన స్వగ్రామమైన నారాయణపురంలో 64 మందికి రూ.21.70 విలువైన సీఎంఆర్‌ఎఫ్ చెక్కులతో పాటు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు.


