కొలువుల కోట !
కార్పొరేట్ స్థాయి వసతులు
ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన పలువురు..
కలెక్టర్, అధికారుల చొరవతో
నాణ్యమైన బోధన, సౌకర్యాలు
ఆర్థిక స్థోమత కారణంగా పోటీ ప్రపంచంలో ముందుకు సాగలేక ఇబ్బంది పడుతున్న వెనుకబడిన తరగతుల అభ్యర్థులకు ఖమ్మంలోని బీసీ స్టడీ సర్కిల్ ఆశాదీపంగా నిలుస్తోంది. ఆర్థిక ఇబ్బందుల చీకట్లను అధిగమించి ఎలాగైనా ప్రభుత్వ కొలువు సాధించాలనే తపనతో ఉన్న యువతీ, యువకులకు విజయాల చిరునామాగా మారింది. ఇక్కడ శిక్షణ పొందిన వందలాది మంది ఉద్యోగాలు సాధిస్తూ తమ కలను సాకారం చేసుకుంటున్నారు. ప్రభుత్వం ప్రకటిస్తున్న ఉద్యోగ ఫలితాల్లో బీసీ స్టడీ సర్కిల్ నుంచి శిక్షణ తీసుకున్న వారు ముందు వరుసలో నిలుస్తుండడంతో నానాటికీ తాకిడి పెరుగుతోంది. – ఖమ్మంమయూరిసెంటర్
అధికారుల ప్రత్యేక చొరవ
బీసీ స్టడీ సర్కిల్‌లో నిరుద్యోగ అభ్యర్థుల కోసం శిక్షణ, సదుపాయాలు కల్పించడంలో అధికారులు కీలకంగా వ్యవహరిస్తున్నారు. కలెక్టర్ ప్రత్యేక దృష్టిసారించడమే కాక అధికారులతో నిరంతరం చర్చిస్తున్నారు. ఇదే సమయాన కలెక్టర్ సౌకర్యాల కల్పనకే పరిమితం కాకుండా అభ్యర్థులకు మార్గదర్శిగా నిలుస్తుండడం వారికి ఉపయోగపడుతోంది.
విజయాల వెల్లువ
కొద్దినెలలుగా నిర్వహిస్తున్న గ్రూప్–1, 2, 3, 4 ఉద్యోగ పరీక్షలతో పాటు పోలీస్ కానిస్టేబుల్, ఎస్‌ఐ, డీఎస్సీ, గురుకుల, హాస్టల్ వెల్ఫేర్ ఉద్యోగాల్లోనూ ఇక్కడ శిక్షణ తీసుకున్న వారు సత్తా చాటారు. ఒకప్పుడు ఇక్కడ శిక్షణ తీసుకునే వారు వేళ్లపై లెక్కించే సంఖ్యలో ఉండగా, ఇప్పుడు అధికారులపై నమ్మకంతో బారులు దీరుతున్నారు. అభ్యర్థుల నమ్మకాన్ని వమ్ము చేయకుండా అధికారులు శ్రద్ధ వహిస్తుండడంతో గత రెండేళ్లలో దాదాపు 150 మందికి పైగా ఉద్యోగాలు సాధించారు. ఇందులో చాలామంది పేదలే ఉండడంతో ఉద్యోగాల సాధనతో వారి తలరాతలు మారుతున్నాయని చెబుతున్నారు. గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు అండగా ఉంటున్న బీసీ స్టడీ సర్కిల్ రాష్ట్రంలోనే రోల్ మోడల్‌గా నిలుస్తోందని చెబుతున్నారు.
దూరప్రాంతాల ప్రైవేట్ సెంటర్లలో శిక్షణ తీసుకోలేని మాకు బీసీ స్టడీ సర్కిల్ వరంలా మారింది. ఇక్కడ చదువుకునేలా అధికారులు అన్ని సౌకర్యాలు కల్పించడమే కాక పుస్తకాలు సమకూర్చడంతో ఏ ఇబ్బందీ రావడం లేదు.
–ఎస్.ఉదయ్‌కల్యాణ్, జూనియర్ అసిస్టెంట్, పీఆర్
స్టడీ సర్కిల్‌లో నిర్వహించే ప్రతీ పరీక్ష రాసేవాడిని. లైబ్రరీలోని పుస్తకాలు చదవడమే కాక అధ్యాపకుల సలహాలతో గ్రూప్–2లో 387 ర్యాంక్ సాధించాను. ఎంపీఓ ఉద్యోగం సాధనలో అధికారుల సహకారం మరవలేనిది.
– పడాల రమేష్, ఎంపీఓగా ఎంపికై న అభ్యర్థి
కలెక్టర్, ఉన్నతాధికారుల సహకారంతో స్టడీ సర్కిల్‌లో నిరుద్యోగులకు సౌకర్యాలు కల్పించడమే కాక స్టడీ మెటీరియల్ సమకూరుస్తున్నాం. అనుభవజ్ఞుల శిక్షణతో అభ్యర్థులు ఉద్యోగాలు సాధిస్తుండడం సంతోషంగా ఉంది.
– జి.శ్రీలత, బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్, ఖమ్మం
ప్రైవేట్ కోచింగ్ సెంటర్లకు దీటుగా బీసీ స్టడీ సర్కిల్‌లో సదుపాయాలు కల్పించారు. పోటీ పరీక్షల కోసం మార్కెట్‌లోని ప్రతీ పుస్తకాన్ని సమకూర్చడమే కాక అభ్యర్థులు రోజంతా చదువుకునేలా రీడింగ్ రూమ్స్, విశాలమైన హాళ్లు ఏర్పాటు చేశారు. అంతేకాక పరీక్షా విధానంపై అవగాహన కల్పించేందుకు ఆన్‌లైన్ టెస్ట్‌లు, వీడియో తరగతుల సదుపాయం కల్పించారు. రాష్ట్రంలోనే పేరున్న సబ్జెక్ట్ నిపుణులతో శిక్షణ ఇప్పిస్తుండడమే కాక స్టడీ మెటీరియల్ సమకూరుస్తూ ఉపకార వేతనం అందిస్తున్నారు.
బీసీ స్టడీ సర్కిల్ శిక్షణతో ప్రతిభ
కొలువుల కోట !
కొలువుల కోట !
కొలువుల కోట !
కొలువుల కోట !
కొలువుల కోట !


