కేయూ స్పోర్ట్స్ బోర్డ్ కార్యదర్శి వై.వెంకయ్య
క్రీడాకారులకు
మరింత ప్రోత్సాహం
ఖమ్మంస్పోర్ట్స్: క్రీడాకారులకు టీఏ, డీఏ, ఇతర ప్రోత్సాహకాలను పెంచేలా తగిన చర్యలు తీసుకుంటున్నామని కాకతీయ యూనివర్సిటీ స్పోర్ట్స్ బోర్డ్ కార్యదర్శి ప్రొఫెసర్ వై.వెంకయ్య వెల్లడించారు. ఖమ్మంలోని ఎస్‌ఆర్ అండ్ బీజీఎన్‌ఆర్ కళాశాల మైదానంలో కాకతీయ యూనివర్సిటీ పరిధి క్రికెట్ పోటీలు శనివారం ప్రారంభమయ్యాయి. ఉమ్మడి ఖమ్మం, ఆదిలాబాద్, వరంగల్ జిల్లాల్లోని జట్లు పాల్గొంటున్న ఈ పోటీలను ప్రారంభించిన వెంకయ్య మాట్లాడుతూ క్రీడాకారులు, కోచ్‌లు, మేనేజర్ల టీఏ, డీఏను 25శాతం పెంచేలా ప్రతిపాదనలు సిద్ధమయ్యాయని తెలిపారు. క్రీడాభివృద్ధి విషయంలో వెనుకడుగు వేయకుండా అన్ని వసతులు కల్పిస్తామని వెల్లడించారు. కేయూ ఫిజికల్ డైరెక్టర్ల సంఘం అధ్యక్షుడు డాక్టర్ జె.సోమన్న మాట్లాడుతూ క్రీడాకారులు ప్రతిభను మెరుగుపర్చుకుని యూనివర్సిటీకి మంచి పేరు తీసుకురావాలన్నారు. ఖమ్మం జోన్ క్రీడల కార్యదర్శి డాక్టర్ బి.వెంకన్న మాట్లాడుతూ ఉమ్మడి జిల్లా నుంచి క్రీడాకారులు ఎక్కువగా యూనివర్సిటీ జట్లకు ఎంపిక అవుతుండడంతో జోన్ పరిధి, యూనివర్సిటీ స్థాయి క్రికెట్ పోటీల నిర్వహణకు అవకాశం దక్కిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ పి.కోటేశ్వరరావు, జె.ఉపేందర్, పీడీలు అఫ్జల్, కుమార్, అస్లాం, సందీప్ తదితరులు పాల్గొన్నారు.
పెద్దమ్మతల్లి ఆలయంలో
చండీహోమం
పాల్వంచరూరల్ : పాల్వంచ మండలం పరిధిలో కొలువుదీరిన శ్రీ పెద్దమ్మతల్లి ఆలయంలో పౌర్ణమిని పురస్కరించుకుని శనివారం చండీహోమం ఘనంగా నిర్వహించారు. ముందుగా మేళతాళాలు, వేద మంత్రాలతో స్వామివారిని ఊరేగింపుగా యాగశాలలోకి తీసుకొచ్చారు. అనంతరం మండపారాధన, గణపతి పూజ అనంతరం హోమం చేసి, చివరకు పూర్ణహుతి జరిపించారు. హోమంలో పాల్గొన్న 17 మంది భక్త దంపతులకు అర్చకులు అమ్మవారి శేషవస్త్ర ప్రసాదాలు అందజేశారు.


